మంత్రుల బృందానికి టీ నోట్‌


నాలుగే కీలకాంశాలు
371-డీ, వనరుల పంపిణీ, సాగునీరు,
హైదరాబాద్‌ పరిధి జీహెచ్‌ఎంసీయా? ఎంసీహెచ్చా?
శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లుకు వడివడిగా అడుగులు
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర హోం శాఖ సిద్ధం చేసిన నివేదికను మంగళవారం కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించింది. ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో నాలుగే కీలకాంశాలుగా హోం శాఖ తేల్చింది. 371-డీ, వనరుల పంపిణీ, సాగునీరు, హైదరాబాద్‌ పరిధి ప్రస్తుతమున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషనా(జీహెచ్‌ఎంసీ)? గతంలో ఉన్న మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాదా (ఎంసీహెచ్‌)? అనే అంశాలు తేల్చాల్సి ఉందని పేర్కొంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈమేరకు 85 పేజీలతో నివేదిక సిద్ధం చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన కీలకాంశాలను అందులో పొందుపర్చింది. సాగునీరు, విద్యుత్‌, విద్య, హైదరాబాద్‌తో పాటు విభజనకు సంబంధించిన అన్ని అంశాలను నివేదికలో ప్రస్తావించింది. హైదరాబాద్‌ను తెలంగాణలో అంతర్భాగంగానే హోం శాఖ పరిగణించింది. శాసన మండలి కొనసాగింపుపై నిర్ణయాధికారం తెలంగాణకే వదిలిపెట్టింది. రాష్ట్ర విభజనకు ఆర్టికల్‌ 371-డీ అడ్డం కాదని హోంశాఖ తేల్చేసింది. ఆర్టికల్‌ 371-డీ ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ జోనల్‌ సిస్టమ్‌ కొనసాగించే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో ఉద్యోగాల విషయంలో అవసరమైతే చిన్న సవరణ చేసే విషయాన్ని పరిశీలించాలని హోం శాఖ సూచించింది. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ కోసం వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతం ముంపునకు గురైనా ఆంధ్ర ప్రాంతానికే ప్రయోజనం కలుగుతుందనే కారణంతో తెలంగాణవాదులు పోలవరాన్ని వ్యతిరేకిస్తున్నారని హోం శాఖ తెలిపింది. నివేదికను మూడు విభాగాలుగా విభజించింది. కేబినెట్‌, ఆంధ్రప్రదేశ్‌ సంక్షిప్త సమాచారం, విభజనకు సంబంధించిన కీలకాంశాలుగా విడదీసింది. రాష్ట్రానికి హైదరాబాద్‌ నుంచే అధిక రెవెన్యూ వస్తోందని, ఇక్కడే 40 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, 28 రక్షణ సంస్థలు, కార్పొరేట్‌ ఆస్పత్రులు, ప్రధాన యూనివర్సిటీలు ఉన్నాయని హోం శాఖ పేర్కొంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన మంత్రుల బృందం నవంబర్‌ 7న మూడోసారి భేటీ కానుంది. ఈ నేపథ్యంలో హోం శాఖ సమగ్రమైన నివేదిక రూపొందించి జీవోఎంకు అందజేసింది. ఈ నివేదికతో పాటు రాష్ట్ర ప్రజల నుంచి కమిటీకి అందే నివేదికల ఆధారంగా మంత్రుల బృందం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.