Monday, 2 November 2026

పటేల్‌ లౌకికవాది మత తత్వాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్‌వాది


ప్రధాని మన్మోహన్‌సింగ్‌
ఒకే వేదికపై మోడీ, మన్మోహన్‌
అహ్మదాబాద్‌, అక్టోబర్‌ 29 (జనంసాక్షి) :
సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ లౌకికవాది అని, మత తత్వాన్ని వ్యతిరేకించిన నిఖార్సయిన కాంగ్రెస్‌ వాది అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన పటేల్‌ స్మారక మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా మన్మోహన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, మన్మోహన్‌సింగ్‌ ఒకే వేదికపై కనిపించారు. కార్యక్రమంలో మొదట ప్రసంగించిన మోడీ దేశానికి జవహర్‌లాల్‌ నెహ్రూకు బదులుగా పటేల్‌ ప్రథమ ప్రధాని అయి ఉంటే భవిష్యత్‌ మహోజ్వలంగా ఉండేదన్నారు. 1919లో గుజరాత్‌లో కౌన్సిలర్‌గా పటేల్‌ ఉన్న రోజుల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఆమోదముద్ర పడేలా చేశారన్నారు. పటేల్‌ను కాంగ్రెస్‌ పార్టీ విస్మరించిందని ఆరోపణలు గుప్పించారు. మోడీ ప్రసంగం అనంతరం మాట్లాడిన మన్మోహన్‌ దీటుగా బదులిచ్చారు. పటేల్‌కు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. లౌకిక విలువల పట్ల ఆయనకు ఎంతో ప్రేమ ఉందని పేర్కొన్నారు. దేశ స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో పటేల్‌ పాత్ర కీలకమైనదని, ఆయన ముమ్మాటికీ ఉక్కు మనిషేనని పేర్కొన్నారు. ఆయన వారసత్వాన్ని కలిగి ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో ఉండటం తన అదృష్టమని తెలిపారు. దేశ సమగ్రత పట్ల ఎంతో విశ్వాసం సర్దార్‌ పటేల్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి జీవితకాలమంతా కృషి చేశారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *