Tuesday, 3 November 2026

బస్తర్‌లో మావోయిస్టుల భయం


వేలికి సిరా చుక్కలేకుండా ఎన్నికల నిర్వహణ యోచన
బస్తర్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి) :
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మావోయిస్టుల భయం పట్టుకుంది. మావోయిస్టులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్న బస్తర్‌ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో ఓటేసిన వారి గుర్తింపుకోసం వేలిపై పెట్టే సిరా చుక్క లేకుండానే ఎన్నికలు జరపాలనే యోచనలో ఎన్నికలు సంఘం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రజలు సైతం ఓటు వేసిన తర్వాత తమ వేలిపై చెరిగిపోని సిరా చుక్కా వేయవద్దని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ ప్రాంతానికి చెందిన వారు కోరుతున్నారు. ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునివ్వడంతో సిరా చుక్క కనిపించిన పక్షంలో వారి నుంచి ముప్పు వస్తుందని గ్రామస్తులు భయపడుతున్నారు. విశ్వసనీయ వర్గాలు చెప్పినదాన్ని బట్టి సిరా చుక్క నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ దంతెవాడ, సుక్మా, బీజాపూర్‌ జిల్లాలకు చెందిన గ్రామస్థులు జిల్లా ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన ప్రాంతంలోని నియోజికవర్గాల్లో సిరా చుక్కను తప్పనిసరి చేయరాదంటూ దంతెవాడ జిల్లా ఎన్నికల అధికారి ప్రతిపాదించారని ప్రధాన ఎన్నికల అధికారి సునీల్‌ కుజర్‌ తెలిపారు. ఆ ప్రతిపాదనను ఎన్నికల సంఘానికి పంపించినట్లు ఆయన చెప్పారు. అధికార వర్గాల చెప్పినదాన్ని బట్టి ఓటు వేసినట్లుగా సిరా గుర్తులు కనిపించిన పక్షంలో వేళ్ళు నరికివేస్తామంటూ మావోయిస్టులు హెచ్చరించడంతో సుక్మా, బీజాపూర్‌ జిల్లాలకు చెందిన గ్రామస్థులు కూడా అదే ప్రతిపాదన చేశారు. సిరా చుక్క లేని పక్షంలో మావోయిస్టులు ముప్పునే బేఖాతరు చేస్తూ ఓటు వేస్తామంటూ కొందరు గ్రామస్థులు ముందుకు వస్తున్నారని వారు తెలిపారు. బస్తర్‌, బీజాపుర్‌, కొండగావ్‌, సుక్మా, నారయణ్‌పూర్‌, దంతెవాడ, కన్‌కెర్‌, రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలోని 18 నక్సల్‌ ప్రభావిత నియోజకవర్గాల్లో ఈ నెల 11న తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. మావోయిస్టులు తమకు గట్టి పట్టు ఉన్న బస్తర్‌ జిల్లాలోని అనేక గ్రామాల్లో గత నెల రోజులుగా తిరుగుతున్నారు. ఎన్నికల బహిష్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పోస్టర్లు అంటిస్తున్నారు. మావోయిస్టుల ముప్పును తివ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అదనంగా 400 కంపెని పారామిలటరీ బలగాలను (40 వేల మంది సిబ్బంది) పంపించింది. కాగా ఇప్పటికే 65వేల మంది పోలిసులు, 27వేల మంది పారా ట్రూపర్లు నక్సల్‌ వ్యతిరేక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *