Tuesday, 3 November 2026

సీడబ్ల్యూసీ తీర్మానం యథాతథంగా అమలు చేయాలి : నాగం జనార్ధన్‌రెడ్డి


హైదరాబాద్‌, నవంబర్‌ 3 (జనంసాక్షి) :
సీడబ్ల్యూసీ తీర్మానం యథాతథంగా అమలు చేయాలని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశా రు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యుడు శ్రీని వాస్‌రెడ్డితో కలిసి  మాట్లాడారు. జూలై 30న సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వెంట్రుకపాటు తేడా లేకుండా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో జరుగుతున్న జాప్యంపై తాము రెండ్రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌జైట్లిని కలిసినట్టు చెప్పారు. మొదట తాము తెలంగాణ ప్రాంతానికి చెందిన వారమని చెప్పామని, కాని తెలంగాణ ప్రాంతం వారు కాదు, తెలంగాణ రాష్ట్రం వారు వచ్చారని చెప్పాలని రాజ్‌నాథ్‌ అన్నట్టు నాగం చెప్పారు. బీజేపీ ద్వారే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి వివరించాలని రాజ్‌నాథ్‌ సూచించారని చెప్పారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ బేషరతుగా మద్దతు పలుకుతుందన్నారు. కాని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు తమ పార్టీతోనే తెలంగాణ వస్తుందని సంబరాలు జరుపుకుంటున్నారని, కాని బీజేపీతోనే తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న విషయం గుర్తించాలన్నారు. రాష్ట్ర విభజన జరగడానికి సీమాంధ్ర పాలకులే కారణమన్నారు. తెలంగాణ అన్ని విధాల అన్యాయం చేశారు కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వందలాది మంది ఆత్మబలిదానం ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఎంత తొందరగా రాష్ట్ర విభజన జరిగితే ఇరు ప్రాంతాల వారికి అంత మంచిందన్నారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అనడంలో అర్థం లేదన్నారు. హైదరాబాద్‌లో ఒక్క తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రజలే లేరని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారని, అలాంటప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి హైదరాబాద్‌పై హక్కు ఉందన్నారు. హైదరాబాద్‌ వెళ్లాలంటే వీసాలు తీసుకుని పోవాలన్నవారు ఉన్నారనివారికి తెలంగాణ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.  పది సంవత్సరాల ఉమ్మడి రాజధానిపై బీజేపీకి ఇష్టంలేదన్నారు. అలాగే సీమాంధ్ర ప్రజలకు, అక్కడి నేతలకు కూడా లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా పోటీచేస్తుందని , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన వారికే టికెట్లు ఇస్తామన్నారు. రానున్నది బీజేపీ మోడీ పరిపాలన అని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వందలోపు ఎంపీ సీట్లు రావడం గగనమన్నారు. ఈ నెల 2వ వారంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ పాత్ర గురించి వివరించడానికి ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. గత 20 సంవత్సరాల  కాలంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు రాష్ట్రాన్ని తిరోగమన దిశలోకి తీసుకెళ్లారని నాగం విమర్శించారు. నేడు దేశంలో ప్రజలు మార్పును కోరకుంటున్నారని, రాష్ట్రంలో కూడా మార్పును కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏమిటో ప్రజలు నిరూపిస్తారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *