నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన మామ్
భూ కక్ష్యలోకి చేరుకున్న పీఎస్‌ఎల్వీ సీ-25
300 రోజుల తర్వాత అంగారక కక్ష్యలోకి
ఇస్రోలో ఆనందోత్సాహాలు
రాష్ట్రపతి, ప్రధానిల అభినందనలు
శ్రీహరికోట, నవంబర్ 5 (జనంసాక్షి) :
అంగారక సన్నాహక యాత్రను భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) విజయవంతంగా ప్రారంభించింది. మంగళవారం మధ్యాహ్నం పీఎస్‌ఎల్‌వీ సీ-25 వాహక నౌక శ్రీహరికోటలోని షార్ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసింది. అంగారకుడి యాత్రలో విజయం సాధించిన దేవాల సరసన భారత్ కూడా చేరింది. ఇందులో నాలుగో స్థానంలో భారత్ నిలిచింది. తొలిప్రయత్నంలోనే విజయం సాధించడం భారత ప్రతిష్టను ఇనుమడింపచేసింది. ఎన్ని విమర్శుల ఎదురైనా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అహర్నిశలు చేసిన కృషికి ఫలితం దక్కింది. ప్రయోగం విజయవంతం చేయడంతో విమర్శకుల నోల్లకు తాలం వేవారు. మంగళయాన్ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ అగ్రరాజ్యాల సరసన చేరింది. పీఎస్‌ఎల్‌వీ సి 25 ప్రయోగం కీలకమైన నాలుగు దశలూ పూర్తి చేసుకుని విజయవంతంగా మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. భారత అంగారక యాత్ర 300 రోజుల ప్రయాణం విజయవంతంగా ప్రారంభమైంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ అంగారకుడిపై జీవాన్వేషణ, వాతావరణ అధ్యయనం చేయనుంది. షార్ సెంటర్ మిషన్ కంట్రోల్ రూం శాస్త్రవేత్తల కరతాళ ధ్వనులతో మార్మోగింది. తొలిదశలో ఇది భూ కక్ష్యలో పదిరోజుల నుంచి 25 రోజుల పాటు ఉంటుంది. ఆ తరవాత 300 రోజులు ప్రయాణించి అంగారక కక్ష్యలోకి చేరుకుంటుంది. 2014 సెపటెంబర్‌లో ఇది కక్ష్యలోకి ప్రవేవిస్తుంది. ఆ తరవాత అక్కడ నుంచి తనకు అప్పగించిన పనిని ప్రారంభిస్తుంది. పీఎస్‌ఎల్వీ సి 25 ప్రయోగం విజయవంతంగా పూర్తిచేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలకు భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అభినందనలు తెలిపారు. బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ భారత అంతరిక్ష శాస్త్రవేత్తలను అభినందించారు. భారత దేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంగారకయాత్ర తొలి అడుగు విజయవంతంగా పడడం పట్ల పలువురు ప్రముఖులు, నేతలు శాస్త్రవేత్తలను అభినందించారు. పీఎస్‌ఎల్‌వీ సి 25 తయారీ నుంచి ప్రయోగం వరకు అంకితమై కృషిచేసిన శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. ఇస్రోకి ఇది ప్రతిష్ఠాత్మక 25 వ ప్రయోగమని అది విజయవంతం కావడం తమకెంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. పీఎస్‌ఎల్వీ సీ -25 సరిగ్గా 44 నిమిషాల్లో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిందని ఆయన తెలిపారు.ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం 2.38 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-25 ప్రయోగాన్ని ప్రారంభించారు. నిప్పులు చెరుగుతూ రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. అంచెలంచెలుగా నాలుగు కీలక దశలనూ దాటుకుని నిర్ణీత భూ కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను ప్రవేశపెట్టింది పీఎస్‌ఎల్‌వీ సి 25. పీఎస్‌ఎల్‌వీ సి 25 ప్రయోగం విజయవంతం కావడం పట్ల భారత అంతరిక్షకేంద్రంలో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తంచేశారు. ఈ విజయం పట్ల షార్ సెంటర్‌కి చెందిన వివిధ విభాగాల సారథులు ఉద్విగ్నంగా స్పందించారు.ఇది ఇస్రో శాస్త్రవేత్తల సమష్టి విజయమని షార్ డైరెక్టర్ ఎం.వై.ఎస్. ప్రసాద్ అన్నారు. ఈ మిషన్‌కు సహకరించిన అందరికీ ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ శివకుమార్ అభినందనలు తెలిపారు.మార్స్‌మిషన్ తొలి అడుగు మాత్రమేనని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్. రామకృష్ణన్ అన్నారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఇది కీలకమైనదని మిషన్ డైరెక్టర్ కున్హి కృష్ణన్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో భారత విజయపతాక రెపరెపలాడింది. ప్రతిష్ఠాత్మక అంగారక యాత్రకు తొలి అడుగు విజయవంతంగా పడింది. తొలిప్రయత్నంలోనే విజయం సాధించడం భారత ప్రతిష్ఠను ఇనుమడింపచేసింది. పీఎస్‌ఎల్‌వీ సీ-25 ప్రయోగం కీలకమైన నాలుగు దశలూ పూర్తి చేసుకుని విజయవంతంగా మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. షార్ సెంటర్ మిషన్ లక్షిత వేగంతో దూసుకెళ్తున్న పీఎస్‌ఎల్వీ సి 25 గురించి పసిఫిక్ సముద్రంలో ఉన్న యమున, నలంద నౌకల నుంచి సమాచారం అందినట్లు షార్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అత్యంత కీలకమైన పీఎస్ 4 ఇంజిన్ ప్రారంభమైందని వారు పేర్కొన్నారు.