వడివడిగా తెలంగాణపై అడుగులు


12న జీవోఎం భేటీ
ఒకే రోజే అఖిలపక్షం
డిసెంబర్‌లో పార్లమెంట్‌లో బిల్లు దిశగా పయనం
హైదరాబాద్‌, నవంబర్‌ 6 (జనంసాక్షి)
తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఈ నెల 12న అఖిలపక్షం సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. విభజనకు ఉద్దేశించిన మంత్రుల బృందాన్ని తాము పట్టించుకోమంటూ టీడీపీ, వైఎస్సార్‌, కాంగ్రెస్‌ పార్టీలు జీఓఎంకు తమ అభిప్రాయాలను పంపించిన ఒక రోజు తర్వాత సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయించింది. తెలంగాణపై నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి జీఓఎం విధి, విధానాలపై రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించడానికి అఖిల పక్షం సమావేశం నిర్వహిస్తోంది. ఆసక్తికర విషయమేమిటంటే జీఓఎంను పట్టించుకోని టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, సీపీఎం పార్టీలను సమావేశానికి ఆహ్వానిం చరాదని హోం శాఖ నిర్ణయించింది. దీన్ని నిరూపిస్తున్నట్లుగా జీఓఎం విధి, విధానాలపై తమ అభిప్రాయాలు తెలుపుతూ నివేదికలు పంపించిన కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ, ఐఎంఐ పార్టీలకు హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఆహ్వాన లేఖలను ఫ్యాక్స్‌ చేసింది. ఈ పరిణామాలు చోటు చేసుకుంటుం డగానే సీమాంధ్రలో ఆందోళన చేస్తున్న ప్రజ లను శాంతింపచేయడానికి సీమాంధ్ర ప్రాంతా నికి పలు రాయితీలు ప్రకటిస్తామనే సంకేతాలు కేంద్రం నుంచి వచ్చాయి. టీడీపీని మరింత ఇరుకున పెట్టడానికి ఏఐసీసీ నాయకత్వం ఆడుతున్న మరో గేమ్‌ ప్లాన్‌లో భాగంగానే అఖిల పక్షానికి ఆహ్వానితుల జాబితా నుంచి టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, సీపీఎం పార్టీలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జీఓఎంను పట్టించు కోరాదనే నిర్ణయించుకున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రక్రియను నిలుపుదల చేయాలని అభ్యర్థిస్తూ ప్రధానికి లేఖ రాయడం ద్వారా ఘోర తప్పిదం చేశారు. ఆ క్రమంలో తెలంగాణ అంశంపై ఆయన రెండు నాల్కల ధోరణిని ఎండగట్టడంలో మేం విజయం సాధించాం. ఇప్పుడిక టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు లేకుండా జరిగే ప్రతిపాదిత అఖిలపక్షం సమావేశం.. విభజన అనంతరం మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక ప్యాకేజీ, ఇతర రాయితీల తాలూకు పూర్తి ఘనత తనదేనని కాంగ్రెస్‌ చెప్పుకోవడానికి ఉపకరిస్తుంది. అని ఒక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు. కాగా అధికార వర్గాలు చెప్పినదాన్ని బట్టి ఈ నెల 12న జీఓఎం ఒకేసారి అన్ని పార్టీల అభిప్రాయలు తీసుకోవడానికి బదులుగా ప్రతి పార్టీకి చెందిన ప్రతినిధితో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తోంది. కేంద్రం తెలంగాణ ముసాయిదా బిల్లును ఖరారు చేయడానికి సన్నాహాకాలు చేసుకుంటున్న తరుణంలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశం ఫలితం ఎలా ఉంటుందా అని సీమాంధ్ర రాజకీయ నా యకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసక్తికరంగా గురువారం ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే కార్యాలయంలో జీఓఎం మూడోసారి సమావేశం కానుంది. కాగా విభజన అనంతరం సీమాంధ్రకు ప్రకటించే ఆర్థిక ప్యాకేజీ, రాయితీలను తన ముసాయిదా నివేదికను జీఓఎం గురువారం నాటి సమావేశంలో ఖరారు చేయవచ్చని భావిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌ ప్రతిపత్తిపై తన వైఖరిని, ఆర్టికల్‌ 371(డి)పై తన నిర్ణయాన్ని కూడా జీఓఎం ఖరారు చేసే అవకాశం ఉంది.
పార్టీలతో అఖిలపక్ష సమావేశం టైంటేబుల్‌:
ఉదయం 11గంటలకు ఎంఐఎం
ఉదయం 11.30గంటలకు బీజేపీ
మధ్యాహ్నం 12గంటలకు సీపీఐ
సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్‌
సాయంత్రం 5.30గంటలకు టీఆర్‌ఎస్‌తో అఖిల పక్ష సమావేశం ఉంటుందని కేంద్ర హోం శాఖ ధ్రువీకరించింది.