
న్యూఢిలీ, నవంబర్ 6 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతున్న సమ యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిని అధిష్టానం ఢిల్లీకి రావాలని ఆదేశించింది. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించి సమైక్య గళం ఆలపిస్తున్న కిరణ్ ఇటీవల అధిష్టానం పెద్దలెవరికీ ఫోన్ చేసినా వారు స్పందించడం లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నాడు. ఈ క్రమంలో అతడికి ఢిల్లీ నుంచి పిలుపురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధిష్టానం పిలు పుమేరకు సీఎం శుక్రవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. అదే రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నా. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) గురువారం సమావేశం కానుండడం, ఈ నెల 12, 13 తేదీల్లో కేంద్ర ¬ం శాఖ అన్ని పార్టీలతో సమావేశమవుతున్న నేపథ్యంలో కిరణ్‌కు పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాను సమైక్యవాదినని, రాష్ట్రాన్ని విభజించకుండా చివరి వరకూ కృషి చేస్తానని గట్టిగా చెప్పుకుంటున్న కిరణ్.. ఢిల్లీ పెద్దలతో ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కిరణ్.. మొదట్లో హైకమాండ్‌కు విధేయుడిగానే వ్యవహరించారు. అధిష్టానం నిర్ణయాలకు అనుగుణంగా మసలుకున్నారు. అయితే, రాష్ట్ర విభజన విషయంలో సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ధిక్కార స్వరం వినిపించడం మొదలు పెట్టారు. రాష్ట్రాన్ని విభజిస్తే జలయుద్ధాలు వస్తాయని, విద్యుత్ లేక తెలంగాణ అంధకారమవుతుందని.. అన్ని ఆలోచించి నిర్నయం తీసుకోవాలని కోరారు. హైకమాండ్ నిర్నయం సరికాదని ఆక్షేపించారు. ఇందిరాగాంధీ వల్లే ఇంకా సమైక్య రాష్ట్రం కొనసాగుతోందని, ఆమె లేకపోవడం వల్లే రాష్టాన్రికి ఈ దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. కిరణ్ ధిక్కార స్వరం విన్పిస్తున్న నేపథ్యంలో హైకమాండ్ ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఏ విషయంలోనూ ఆయనను సంప్రదించకపోవడంతో పాటు సీఎం ఫోన్ చేసినా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలోనే కిరణ్‌కు ఫోన్ చేసి ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటన కిరణ్‌కు అత్యంత కీలకమని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. హైకమాండ్ పిలుపు నేపథ్యంలో సీఎం మార్పు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రికి సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా? లేక అఖిలపక్ష సమావేశం జరపడానికి వీలుగా ఆయనను కూడా ఒప్పించడానికి పిలుస్తున్నారా? అన్నది చర్చనీయాంశమైంది.
విభజన వేళ కిరణ్‌కు ఢిల్లీ బులావ్




