Tuesday, 3 November 2026

సీఎంగా కిరణ్‌ తిరిగొస్తాడనుకోవడం డౌటే


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రిగా ఈక్షణం వరకు ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం డిల్లీనుంచి సీఎంగా తిరిగి వస్తాడనుకోవడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ నారాయణ పేర్కొన్నారు. గురువారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో తెలంగాణకు అనుకూలంగా వ్యవహారాలు చురుకుగా కదులుతు న్నాయన్నారు. సమైక్యవాదిగా ముద్రవేసుకుంటూ దూసుకెల్తున్న కిరణ్‌ చరిత్ర శుక్రవారంతో ముగుస్తుందేమోననే ఢిల్లీ పరిణామాలు చూస్తుంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. హైకమాండ్‌ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న సీఎం కిరణ్‌ తర్వాత పది రోజులకు తేరుకుని భిన్నంగా వ్యవహరిస్తూ అధిష్టానానికి కొరకగాని కొయ్యగా మారిపోయాడని ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్రం గుర్తించిందన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం అదేనన్నారు. తీవ్రంగా మందలించి తప్పించే అవకాశాలున్నాయని తెలుస్తోందన్నారు. పంజాబ్‌ రాష్ట్రం ఏర్పడే సమయంలో కూడా అప్పటి ముఖ్యమంత్రిని తప్పించి రాష్ట్ర అసెంబ్లీని తాత్కాలికంగా సుప్తనావస్థలో ఉంచి విభజన కార్యక్రమాన్ని ముగించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే తీరును పాటించేలా కాంగ్రెస్‌ అడుగులు వేస్తోందనిపిస్తోందన్నారు. తాను మాత్రం ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వస్తాడనుకోవడంలేదన్నారు. ఆయన ఢిల్లీకి వెల్లే ముందే గవర్నర్‌ను కలువడం కూడా ఇందుకు బలం చేకూరుస్తుందని నారాయణ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *