Tuesday, 3 November 2026

ఎన్నికల పేర ప్రజలపై తీవ్ర నిర్బంధం


బహిష్కరణకే కట్టుబడ్డామన్న మావోయిస్టు పార్టీ
బస్తర్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి) :
ఎన్నికల పేరిట భారత ప్రభుత్వం ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని మోపిందని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి రామన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన బస్తర్‌లో మీడియా ప్రతినిధులకు ప్రత్యేక లేఖ విడుదల చేశారు. నిష్పక్షపాత, స్వతంత్ర ఎన్నికల పేర భారత ప్రభుత్వం 18 పోరాట కేంద్రాల్లో 650 కంపెనీల సాయుధ బలగాలను మోహరించిందని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. వారు స్వచ్ఛంద ఎన్నికల బహిష్కరణకు కట్టుబడినా రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీలు, 24 గంటల పాటు పెట్రోలింగ్‌, అడుగడుగునా పోలీస్‌ పహారా, మొబైల్‌ చెక్‌పోస్టులు, నిరవధిక కూబింగ్‌లు, గ్రామాలపై దాడులు, అక్రమ అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్లు, అక్రమ నిర్బంధాలు, ప్రజలను మాయం చేయడం దండకారణ్యంలో నిత్యకృత్యంగా మారాయన్నారు. విద్యార్థులను హాస్టళ్లనుంచి బలవంతంగా ఖాళీ చేయించడం, సాయుధ బలగాల ఆశ్రయం కోసం ప్రభుత్వం పాఠశాలలను ఆక్రమించుకోవడంతో విద్యార్థుల చదువులు సాగడం లేదని తెలిపారు. ప్రజల స్వాతంత్య్రాన్ని హరించేలా, అప్రజాస్వామికంగా పోలీసు బలగాలు వ్యవహరిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ రానున్న ఐదు సంవత్సరాల పాటు పాలన సాగించేందుకు ప్రజల హక్కులను కాలరాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తాధిపత్య సంస్థలు, బహుళజాతి సంస్థలు కనుసన్నల్లోనే ప్రజలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల జీవితాల్ని మెరుగు పరిచేందుకు అట్టడుగు ప్రజానీకన్ని ఉద్దరించేందుకు రాజకీయ వ్యవస్థలో పార్టీలు, ప్రభుత్వాల దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా భద్రత బలగాలపై ఆధారపడటం ఆత్మాహత్య సదృశ్యమేనని కేంద్రానికి తలంటారు. కూబింగ్‌ పేరిట ప్రత్యేకంగా ఆదివాసీ మహిళలను చెప్పుకోలేని విధంగా వేధించడం, సామూహిక అత్యాచారాలకు పాల్పడటం ఇక్కడ నిత్యకృత్యంగా మారిందన్నారు. అక్రమ నిర్బంధాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తూ సాక్ష్యాధారాలు మాయం చేస్తున్నారని పేర్కొన్నారు. పీకల్లోతు కుంభకోణాల్లో కూరుకుపోయిన ప్రభుత్వాలు ప్రజలకు తాగు, సాగునీటి సదుపాయాలు కల్పించడంలో 60 ఏళ్లుగా వైఫల్యం చెందాయన్నారు. ఈ ప్రభుత్వాలు ప్రజలకు కరెంటు కోతలు కష్టాలు మిగిల్చాయన్నారు. కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న యూపీఏ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలకు శత్రువుగా మారిందని, ఎన్నికలు బహిష్కరించాలన్న విప్లవ కార్యకర్తలపై తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్నాయని తెలిపారు. గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ పేర ప్రజలపై అన్యాయపు యుద్ధాన్ని ప్రకటించి అమాయకుల్ని హతమారుస్తోందన్నారు. దీన్ని భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మావోయిస్టు) తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. 60 ఏళ్లుగా ప్రజల జీవితాల్ని మార్చలేని బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *