తెలంగాణాకే నష్టం
సమైక్యంగా ఉంచాల్సిందే
చిల్లకల్లు రచ్చబండలో సీఎం
విజయవాడ, నవంబర్ 16 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ గవే కిరికిరి మాటలు మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణాకే నష్టమని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని మళ్లీ పాతపాటే పాడాడు. చిల్లకల్లులో శనివారం మధ్యాహ్నం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన ప్రసంగిం చారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి చింతిస్తున్నా.. రాష్ట్రం సమైక్యంగా ఉండడం వల్లే నిధులు మళ్లకుండా అడ్డుకున్నామని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించుకున్నాం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించు కున్నాం నారాయణపూర్ ప్రాజెక్టు నిర్మించుకున్నాం జూరాల కట్టుకున్నాం.. ఆల్మట్టి కట్టారు మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు, కర్నాటక నుంచి కృష్ణా డెల్టాకు నీరు రావాల్సిన విషయం తెలిసిందే నన్నారు. 300 టిఎంసిలు తక్కువగా జలాలు వస్తున్నాయి. వాటి కోసం పులిచింతల ప్రాజెక్టు నిర్మించుకుంటున్నాం డిసెంబర్ తొలి వారంలో దాన్ని విజయవాడలోనే సభ పెట్టి జాతికి అంకితం చేయనున్నట్టు తెలిపారు. వేలాది ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. తాగు నీరు కూడా లభిస్తుందన్నారు. సమైక్యంగా ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయన్నారు. కేంద్రం నికర జలాల గురించే మాట్లాడుతోంది. మిగులు జలాల వినియోగం గురించి స్పందించడం లేదన్నారు. ఒకవేళ విడిపోతే.. ప్రాజెక్టులను ఎలా విభజిస్తారో చెప్పాలని అధిష్టానాన్ని కోరుతున్నానని అన్నారు. కలిసి ఉండడం వల్లే ఇన్ని ప్రాజెక్టులను నిర్మించు కోగలిగామన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళుతున్నానని అన్నారు. రాష్ట్రం విడిపోతే ప్రాజెక్టులను ఎలా నిర్వహిస్తారో చెప్పాలని అడుగుతున్నాం. విభజన తర్వాత కృష్ణా జలాలను ఎలా పంచుతారో చెప్పాలి. విభజన వల్ల తెలంగాణకే అధిక నష్టం.. బోర్ల ద్వారా తెలంగాణలోనే ఎక్కువ శాతం భూమి సాగవుతోంది. 371 (డి) వల్ల ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులకు సమస్యలొస్తాయి. తెలంగాణకే అపార నష్టం జరుగుతుంది. ఆ విషయాన్ని వారు పట్టించుకోవడం లేదన్నారు. సాగునీరు అందదు. విద్యుత్ కష్టాలు ఉత్పన్నమవుతాయి. మరో 175 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను తెలంగాణ ప్రాంతం వరకు ఉత్పిత్తి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందన్నారు. అందుకుగాను దాదాపుగా 40వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు. ప్రాజెక్టుల పూర్తికి మరో 60, 70వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుందన్నారు. వాటన్నింటి గురించి స్పష్టత వచ్చాకే ముందుకు వెళ్లాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న చంద్రబాబు తెలంగాణకు అనుకూలమని ఏనాడో లేఖ ఇచ్చారన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించొచ్చని వైఎస్ఆర్సిపి సలహా ఇచ్చింది. ఆ తర్వాతే తాము నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్‌పార్టీ అంటుందోన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామని, పదే పదే విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. సమైక్యవాదం రాజకీయ నినాదం కాదు.. విభజన వల్ల వచ్చే ఇబ్బందులను వివరించే ప్రయత్నం.. 18వ తేదీన జీవోఎంకు స్పష్టంగా చెబుతా.. విభజన వల్ల తలెత్తే సమస్యలను జీవోఎంకు నివేదిస్తానని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఆఖరి వరకు పోరాడుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న విషయాన్ని మరోమారు స్పష్టం చేయనున్నట్టు చెప్పారు.
రైతులకు, పేదలకు చేదోడుగా..
పేదలకు ప్రభుత్వ పథకాలు అందజేయడానికే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మూడో విడత రచ్చబండ కార్యక్రమం ఈ నెల 11వ తేదీన ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగించనున్నట్టు వెల్లడించారు. రైతులకు 450కోట్ల రూపాయల మేర వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తున్న ఘనత తమ పార్టీకే దక్కుతుందని చెప్పారు. పేదల అభ్యున్నతి కోసం పాటు పడుతున్నామన్నారు. పేదల కోసం ఎన్నో కొత్త పథకాలతో ముందుకొస్తున్నామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల కోసం బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించామన్నారు. వచ్చే అయిదేళ్లల్లో అతి పెద్ద ప్రణాళికా బడ్జెట్ మనకే మంజూరైందన్నారు. వచ్చే ఐదేళ్లకు గాను 3.5లక్షల కోట్ల రూపాయలకు ప్రణాళికా సంఘం నుండి అనుమతి వచ్చిందని అన్నారు.
తన పదవీ కాలంలో..
తాను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి మరో 10 రోజుల్లో మూడేళ్లు పూర్తవుతాయని కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పారు. తాను పదవిని చేపట్టిన కొత్తలో రాష్ట్రంలో రాజకీయంగాను, ఆర్థికపరంగాను ఎన్నో సమస్యలున్నాయన్నారు. సంక్షేమ పథకాలకు 9 వేల కోట్ల రూపాయల పైచిలుకు ప్రభుత్వం బకాయి ఉన్నదన్నారు. వనరులను సద్వినియోగం చేసుకుంటూ లోటుపాట్లు సరిదిద్దుకుంటూ ఆర్థికంగా పుంజుకునేందుకు అనేక చర్యలు చేపట్టానన్నారు. క్రమంగా 45వేల కోట్ల రూపాయల మేర వృద్ధి సాధించానని.. ప్రస్తుతం 75వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోగలిగామని తెలిపారు. సమైక్యంగా ఉండడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ రచ్చబండ కార్యక్రమంలో ఎంపి లగడపాటి రాజగోపాల్, మంత్రి కె.పార్ధసారథి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్దప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కిరణ్‌వి గవే కిరికిరి మాటలు




