తుది దశకు తెలంగాణ

21న జీవోఎం చివరి సమావేశం
అదే రోజు కేబినెట్‌కు నివేదిక
వెనువెంటనే అసెంబ్లీకి..
శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు
న్యూఢిలీ, నవంబర్‌ 18 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశం తుది దశకు చేరింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం తన సంప్రదింపుల ప్రక్రియను సోమవారం పూర్తి చేసింది. చివరగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయాలను సేకరించింది. ప్రజలు ఈమెయిళ్ల ద్వారా సమర్పించిన వేలాది నివేదికలను క్రోడికరించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రానికి చెందిన గుర్తింపు పొందిన పార్టీల అభిప్రాయాలతో పాటు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి అభిప్రాయాలను పరిశీలించి తుది నివేదిక రూపొందించనుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎనిమిది కీలకశాఖల కార్యదర్శులతో సుదీర్ఘంగా భేటీ అయిన జీవోఎం విభజన నేపథ్యంలో ఆస్తులు, అప్పులు, విద్యుత్‌, నీటి పంపకాలు తదితర అంశాలపై ఒక అభిప్రాయానికి వచ్చింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌ బృందం సమర్పించిన నివేదికతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇదివరకే సిద్ధం చేసిన నివేదికనూ పరిగణిలోకి తీసుకోనుంది. సీమాంధ్ర భూభాగంతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి.. ఏ నగరాన్ని ఇందుకు ఎంపిక చేయాలి, స్థానిక పరిస్థితులు, సీమాంధ్ర, తెలంగాణలోని వెనుకబడి ప్రాంతాల అభివృద్ధికి ఎలాంటి ప్యాకేజీలు ఇవ్వాలి, అత్యంత కీలకమైన హైదరాబాద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేసిన జీవోఎం ఈనెల 21న చివరిసారిగా భేటీ కానుంది. అదేరోజు తాము సిద్ధం చేసిన నివేదిక కేంద్ర కేబినెట్‌కు సమర్పిస్తుంది. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోట్‌ సిద్ధం చేసి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపుతుంది. అసెంబ్లీ అభిప్రాయం తర్వాత బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లిన పార్లమెంట్‌ ఉభయ సభల ముందుకు వస్తుంది.
నెలాకరుకు నివేదిక సిద్ధం : మొయిలీ
ఈ నెలఖరులోగా జీఓఎం నివేదిక సిద్ధం అవుతుందని కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేగవంతంగా జరుగుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మొయిలీ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కేంద్రం వేగవంతం చేసినట్లు తెలిపారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన సీమాంధ్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన సీమాంధ్రులు చింతించాల్సిన పని లేదని గతంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపిన సంగతి తెలిసిందే. సీమాంధ్రకు తగిన న్యాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆంటోనీ కమిటీ ఇప్పటికే ముసాయిదా తయారు చేసిందని, దాన్ని ఒకట్రెండు రోజుల్లో జీవోఎంకు అందిస్తామని చెప్పారు.
శీతకాల సమావేశాల్లోనే టీ బిల్లు : షిండే
ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు రానుందని జీవోఎం ఛైర్మన్‌, కేంద్ర¬ంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. రాష్ట్ర విభజన అంశంపై సంప్రదింపుల పర్వం ముగిసిందన్నారు. నెలాఖరుకు నివేదిక రూపొందించి కేబినెట్‌ ముండు పెడతామని షిండే వెల్లడించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. త్వరలోనే నివేదిక రూపొందిస్తామన్నారు. అలాగే శీతాకాల సమావేశాల్లోనే బిల్లు వస్తుందన్నారు.