కొందరు సమైక్యం.. మరికొందరు అధిష్టానమే ఫైనల్
ఉమ్మడి రాజధానికి ఒప్పుకోం : కిశోర్ చంద్రదేవ్
న్యూఢిల్లీ, నవంబర్ 18 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ విభజనపై సీమాంధ్ర మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారు. సోమవారం జీవోఎంకు ఈ విధంగా తలోమాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు విశాణకు రాజధాని చేయాలని, ఉమ్మడి రాజధాని ఆలోచన సరికాదని కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ అన్నారు. ఉమ్మడి రాజధాని ఆలోచనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. విశాఖను ఆంధప్రదేశ్‌కు రాజధానిగా ప్రకటించాలని కిశోర్ చంద్రదేవ్ సూచించారు. సీమాంధ్ర ప్రాంతానికి తక్షణమే కొత్త రాజధానిని ప్రకటించాలని ఆయన కోరారు. అలాగే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. అప్పుడే సమస్యలు రావన్నారు.. విశాఖపట్నానికి రాజధానికి ఉండాల్సిన అన్ని అర్హతలున్నాయని, 1953 ఫిబ్రవరిలో జస్టిస్ వాంఛూ కమిషన్ నివేదిక కూడా ఇదే చెప్పిందని ఆయన అన్నారు. ఈ 60 ఏళ్లలో విశాఖపట్నం మరింత అభివృద్ధి చెందిందని ఆయన జీవోఎంకు చెప్పారు. 1979-80లో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 20 వేల ఎకరాలు సేకరించారని, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సేకరించిన 29 వేల ఎకరాల్లో 9 వేల ఎకరాలు నిరుపయోగంగా ఉందని, ప్రత్యేక ఆర్థిక మండలి కోసం మరొక 9 వేల ఎకరాలు ఇప్పటికే సేకరించారని అందుబాటులో ఉన్న ఈ 18 వేల ఎకరాల్లో పరిపాలన భవనాలు నిర్మించుకోవచ్చని ఆయన తెలిపారు. తక్షణమే రెండు పెద్ద భవనాలు అద్దెకు తీసుకుని పాలన ప్రారంభించవచ్చన్నారు. విశాఖకు దగ్గరగా ఉన్న 12 పట్టణాల్లో ఇతర పాలనా వ్యవస్థలు ఏర్పాటుచేసుకోవచ్చన్నారు. రాయలసీమ ప్రజలు కోస్తాంధ్రతో కలిసి ఉండేందుకు ఇష్టపడట్లేదని, రాయలసీమను తెలంగాణలో కలపడం కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయడం కానీ చేయాలని కిశోర్ చంద్రదేవ్ సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన ఆంధప్రదేశ్‌కు 25 ఏళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ఆయన జిఎంవో ఉందుంచారు. అప్పుడే న్యాయం జరుగుతుందన్నారు.
సమైక్యాన్ని కోరుకున్నాం : జెడి శీలం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జీవోఎంను కోరినట్లు సీమాంధ్ర నేతలు చెప్పారు. విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించామని, జీవోఎం తమ సమస్యలను పరిష్కరిస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, జేడీ శీలం, పనబాక లక్ష్మి, పురందేశ్వరి, పళ్లంరాజు, కిల్లి కృపారాణి జీవోఎంతో సమావేశమయ్యారు. అనంతరం జేడీ శీలం మీడియాతో మాట్లాడుతూ సమైక్యాన్నే కొనసాగించాలని కోరామన్నారు. హైదరాబాద్ నగరంలో మూడో వంతు సీమాంధ్ర ప్రజలు ఉన్నారని, సమస్యలు పరిష్కరించిన తర్వాతే ముందుకెళ్లాలని సూచించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్ చుట్టూ అనేక అనుబంధ సంస్థలు ఏర్పడ్డాయని, హైదరాబాద్ అందరిదీ అని జేడీ శీలం అన్నారు. ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయన్నారు. హైదరాబాద్‌పై అందరూ అనుబంధం పెంచుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర కేంద్రమంత్రుల బృందం ఏడు పేజీల నివేదికను జీవోఎంకు అందజేసింది. విభజన అనివార్యమైతే హెచ్ఎండీఏ ప్రాంతాన్ని ఢిల్లీ తరహా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శీలం కోరారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటే 5 రాష్టాల్రకు లబ్ది చేకూరుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ మొట్టమొదటి డిమాండని ఆయన స్పష్టం చేశారు. విభజన అనివార్యమైతే సీమాంధ్ర ప్రజల సమస్యలను ముందుగా పరిష్కరించాలన్నారు. వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరామన్నారు. మంత్రుల బృందం సానుకూలంగా స్పందించిందన్నారు. ఇదిలావుంటే విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందానికి కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఐదు పేజీల నివేదికను సమర్పించారు. ఐదు పేజీల నివేదికలోని ప్రధాన సారాంశం…’ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్యనున్న విజయవాడను రాజధానిగా చేయాలి. విజయవాడకు 50 కి.మీ. పరిధిలో ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా చేయాలి. ప్రకాశం జిల్లాలోని వాన్‌పిక్ ప్రాంతంలో చమురుశుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరారు.
సీమాంధ్ర మంత్రులది తలోమాట




