Tuesday, 3 November 2026

ఒక్క అవకాశం ఇవ్వండి

15 రోజుల్లో జన్‌ లోక్‌పాల్‌
అవినీతి రహిత ఢిల్లీ
ఆమ్‌ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో విడుదల
న్యూఢిల్లీ, నవంబర్‌ 20 (జనంసాక్షి) :
ఢిల్లీ ప్రజలు తమకు ఒక్క అవకాశం ఇస్తే 15 రోజుల్లో జన్‌లోక్‌పాల్‌ బిల్లును తీసుకువస్తామని, అవినీతి రహిత ఢిల్లీగా తీర్చిదిద్దుతామని ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. బుధవారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన నాయకులతో కలిసి విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకే అధికారం కట్టబెడతామని చెప్పారు. విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని అన్నారు. రాజధానిలోని అన్ని కాలనీల్లో అధికార వికేంద్రీకరణ పేరుతో ఏటా కాలనీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఆయా కాలనీల్లో అవసరమైన పనులపై కాలనీ వాసులే సొంతగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పిస్తామని, వారే ఆయా పనులను చేపట్టవచ్చని తెలిపారు. అందుకు అవసరమైన నిధులు స్వయంగా అందజేస్తామన్నారు. వాటిలో రాజకీయ నాయకులు, అధికారులకు ఏమాత్రం జోక్యం ఉండబోదని తెలిపారు. షీలా ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచి ఢిల్లీ వాసుల నడ్డి విరించిందని ఆరోపించారు. తాము ఆ భారాన్ని తగ్గిస్తామని చెప్పారు. ఢిల్లీ పరిధిలో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేస్తామన్నారు. పోలీసు వ్యవస్థను కూడా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు యోగేంద్రయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *