Tuesday, 3 November 2026

సంపూర్ణ తెలంగాణే

కాదంటే మరో పోరు : కోదండరామ్‌
నల్గొండ, నవంబర్‌ 21 (జనంసాక్షి) :
హైదరాబాద్‌, పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ ధ్యేయమని, అలాకాకుండా ఎలాంటి కొర్రీలు పెట్టిన మరో పోరుకు సిద్ధమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. నల్గొండలో గురువారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజలు కోరుకున్న విధంగానే కొత్త రాష్ట్రం సరిహద్దులు ఉండాలని అన్నారు. పోలవరం నిర్మాణం కోసమే సీమాంధ్రులు భద్రాచలం తమకు కావాలని డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపించారు. భద్రాచలంపై ప్రేమతో తమతో కలపాలని సీమాంధ్రులు కోరడం లేదన్నారు. నాగర్జునసాగర్‌ నీటిని దోచుకోవడానికే మునగాలను కృష్ణా జిల్లాలో కలపాలని కోరుతున్నారని తెలిపారు. 1956కు పూర్వం మునగాల, భద్రాచలం సీమాంధ్రతో కలిసి ఉండి పడిన కష్టాలు చాలని, కనీసం దరిదాపుల్లో లేని ప్రాంతాలకు అన్యాయం చేయడానికే సీమాంధ్రులు కొత్త డిమాండ్లు ముందుకు తీసుకువస్తున్నారని అన్నారు. సంపూర్ణ తెలంగాణ ఏర్పడకుంటే టీ జేఏసీ ఆధ్వర్యంలో మరో భారీ ఉద్యమానికి రూపకల్పన చేస్తామని అన్నారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ ఏర్పడే వేళ తప్పుడు రాజకీయాలకు పాల్పడవద్దని తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఆడుకోవద్దని సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకే నడుచుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *