Tuesday, 3 November 2026

సర్కారీ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి

తెలంగాణ పునర్నిర్మాణంలో కబ్జా భూముల్ని స్వాధీనం చేసుకుంటాం : హరీశ్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 23 (జనంసాక్షి) :

సర్కారీ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 2004 నుంచి ప్రభుత్వ భూములపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి సచివాలయం నుంచే భూ దోపిడీ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణవాదుల దృష్టి రాష్ట్ర విభజనపై ఉంటే సీమాంధ్ర నేతల దృష్టి భూదోపిడీపై ఉందని అన్నారు. దొరికిన కాడిక దోచుకోవాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర విభజన తప్పదని భావిస్తూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టిన మాదిరిగా సచివాలయం సాక్షిగా ముఖ్యమంత్రి భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. దేశస్వాతంత్య్రం నుంచి కూడా బ్రిటిష్‌ పాలకులు ఇదే మాదిరిగా దోచుకున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ భూములు పెట్టుబడి దారులకు అప్పగిస్తే, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దొంగ కపెనీలకు కట్టబెట్టాడని ఆరోపించారు. బాబు, వైఎస్సార్లను తలదన్నెలా కవుల దారు ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాయదుర్గంలో 279 ఎకరాల ప్రభుత్వ భూమిని సీమాంధ్రకు చెందిన ప్రైవేటు వ్యక్తులకు ముఖ్యమంత్రి కట్టబెట్టారని ఆరోపించారు. 2001 నుంచి ఈ భూమి ప్రభుత్వానిదేనని అన్నారు. గచ్చిబౌలిలోని 190 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా అన్యాక్రాంతమైందని ఆరోపించారు. వందలకోట్ల రూపాయలు గల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ శాఖ ప్రైవేటు వ్యక్తులకు ఆ శాఖ ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. ఆర్డీవోలు, ఎంఆర్వోలను సచివాలయానికి పిలిపించుకుని ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి భూ సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూముల కేసులను ముఖ్యమంత్రి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న భూములపై ఇప్పుడు అధీనంలో ఉన్న ప్రభుత్వ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ భూములను సీమాంధ్రులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. 2004 నుంచి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏకంగా రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలో హయాంలో కోర్టుల్లోని ఎన్ని ప్రభుత్వ కేసులు గెలిచారో… ఓడిపోయారో! ఎన్నికోట్ల రూపాయలు నష్టం జరిగిందో! ముఖ్యమంత్రి వాటిపై శ్వేతపత్రం అందజేయాలని డిమాండ్‌ చేశారు. 2004 నుంచి 15వేల కోట్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోని 9వేలకోట్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతే ఒక్క హైదరాబాద్‌లోనే రూ.8కోట్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని హరీష్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని భూములను కాపాడేందుకు ఒక న్యాయవాదిని తమకు అప్పగించాలన్న జిల్లా కలెక్టర్‌ కోరికను కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *