Tuesday, 3 November 2026

జగన్‌ బాబు దింపుడుకళ్లం ఆశ

సమైక్య చాంపియన్‌ కోసం కసరత్తు

రాష్ట్రపతి సహా జాతీయ నేతలకు వేడుకోలు

న్యూఢిల్లీ, నవంబర్‌ 23 (జనంసాక్షి) :

సమైక్యరాష్ట్రం చాంపియన్‌ తానే అనిపించుకోవాలని దింపుడుకళ్లం ఆశతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఢిల్లీతో సహా పలు నగరాలకు చెక్కర్లు కొడుతున్నాడు. తద్వారా సీమాంధ్రలో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని ఆరాటపడుతున్నాడు. శనివారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని శనివారం జగన్‌ కలిశారు. రాష్ట్ర విభజనను ఆపి సమైక్యంగా ఉంచాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. విభజన జరిగితే నీటి సమస్యలు వస్తాయని ప్రణబ్‌కు చెప్పామని జగన్‌ మీడియాకు వివరించారు. ఆర్టికల్‌ 371డీ ని సవరించకుండా విభజన సాధ్యపడదని, దానివల్ల వచ్చే చిక్కులన వివరించామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తాము శాయశక్తుల కృషి చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం జనతాదళ్‌(యూ) అధినేత శరద్‌యాదవ్‌ను కూడా జగన్‌ కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత ఆదివారం జగన్‌ భువనేశ్వర్‌ వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కలుసుకుంటారని ఆ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా రాష్ట్ర సమైక్యత కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించాలని ఆయన కోరుతున్నారు. దీంతో పాటు కేంద్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేస్తోందని జగన్‌ జాతీయ నేతల ఎదుట వాధిస్తున్నారు. ముందుగా జగన్‌ వామపక్ష నాయకులతో కలిసి ఈ వాదనలు వినిపించారు. సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌, పొలిట్‌ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌లతో భేటీ అయిన విషయం విదితమే. ఈ సందర్భంగా జగన్‌ వారి మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నించారు. విభజన అంశానికి సీపీఐ, బీజేపీ మద్దతు ప్రకటించడంతో అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీని కలిసి తన వాదనలు వినిపించారు. ఢిల్లీ నుంచి భువనేశ్వర్‌ బయలుదేరి అక్కడ ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌ సమైక్యత కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించాలని కోరనున్నారు. అక్కడి నుంచి ముంబయి వెళ్లి శరద్‌పవార్‌ను కలవనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సమైక్య నినాదంతో ఆయన తన వ్యూహాలకు పదునుపెడుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో ఇతర పార్టీలకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సీమాంధ్ర ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని, తద్వారా 2014 ఎన్నికల్లో లబ్ధిపొందాలని ఆరాటపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *