అప్రమత్తంగా ఉండండి : వాతావరణశాఖ
విశాకపట్టణం, నవంబర్ 26 (జనంసాక్షి) :
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘లెహర్’ తుపాను స్థిరంగా కొనసాగుతుంది. పోర్టు బ్లెయిర్‌కు 300 కి.మీ. దూరంలో తీవ్ర పెను తుపాను కేంద్రీకృతమైంది. కళింగపట్నానికి ఆగ్నేయ దిశలో 900 కి.విూ. దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 28న మధ్యాహ్నం కాకినాడ వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉంది. లెహర్ నేపథ్యంలో ఆరెంజ్ మెసేజ్‌ను భారత వాతావరణ శాఖ జారీ చేసింది. బుధవారం సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో, ఎల్లుండి నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాకినాడ వద్ద తీరం దాటిన తర్వాత లెహర్ తుపాను బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను తీరం దాటిన తర్వాత ఛత్తీస్‌గఢ్ వైపు పయనించి పూర్తిగా బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. రేపు రాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.విూ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇదిలావుంటే 1996లో సంభవించిన కోనసీమ తుపానుకు రెట్టింపు వినాశనాన్ని లెహర్ తుపాను సృష్టిస్తుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఆమె సెలవు ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా తెరవకూడదని ఆమె తెలిపారు. ఆ రెండు రోజులూ జిల్లాలో రోడ్డు, రైలు మార్గాల్లో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం:మంత్రి రఘువీరారెడ్డి
‘లెహర్’ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికారులను అప్రమత్తం చేశామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో తుఫాన్‌తో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నీలం తుఫాన్ నష్ట పరిహారం రూ.776 కోట్లు ప్రభుత్వం విడుదల చేశారన్నారు. నష్టపరిహారం త్వరగా రైతులకు అందేలా కృషి చేస్తామని మంత్రి రఘువీరా వివరించారు. హెలెన్ తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని త్వరగా అంచనా వేయాలని మంత్రి అధికారులన ఆదేశించారు. పంట సాగుచేసిన రైతులకు మాత్రమే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నర్సాపురం మండలం చిట్టవరం గ్రామంలో తుపానుకు నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగుచేసిన కౌలు రైతులు గానీ, సొంతదారులు గానీ ఎవరు సాగుచేస్తే వారికే నష్టపరిహారం అందేలా అధికారులు పక్కాగా పరిశీలించి పంటనష్టాన్ని నమోదుచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో గతంలో వచ్చిన నీలం తుపానుకు సంబంధించి కేంద్రం నుంచి రూ.776 కోట్లు రావాల్సి ఉందని, ఆ నిధులు వచ్చిన వెంటనే రైతులకు పంపిణీ చేస్తామన్నారు. తుపానులో నష్టానికి గురైన ప్రతి ఇంటికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఏర్పడిన లెహెర్ తుపాను ప్రభావం వల్ల జిల్లాకు పెనుప్రమాదం పొంచి ఉందని, అందువల్ల సముద్రతీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. మంత్రి వెంట టూరిజం శాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్, ఎంపీ కనుమూరి బాపిరాజు, డీసీసీబీ ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వర్రావు, ఆర్డీవో వసంతరావు, డీఎస్పీ రఘువీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరాం తదితరులు ఉన్నారు.
పెను ప్రళయం సృష్టించనున్న లెహర్ తుపాను




