టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్, నవంబర్ 29 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తి అడ్డుకోలేదని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష ప్రారంభించిన 2009 నవంబర్ 28ని పురస్కరించుకొని నగరంలోని ఇందిరాపార్క్ వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్ష దివస్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసేందుకు కేసీఆర్ దీక్ష ఎంతగానో దోహదపడిందని అన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష తర్వాతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని తెలిపారు. ఎన్నో త్యాగాలు, సుదీర్ఘ ఉద్యమ చరిత్ర ఉన్న తెలంగాణ ఏర్పాటులో కొర్రీలు పెడితే కేంద్రం దాని ప్రతిఫలాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీమాంధ్ర పెత్తందారులు, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ తెలంగాణను ఆపలేరని, అడ్డుకునే శక్తి వారికి లేదని ఆయన అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన పది జిల్లాలు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ సాధించుకొని తీరుతామన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక ప్రాంతానికి పక్షపాతం వహించడం అంటే రాజ్యాంగాన్నే అవమానించడమని, అలాంటి వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడే వరకూ ఉద్యమాన్ని ఆపబోమని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణం కోసం పాటు పడతామని తెలిపారు. కేసీఆర్‌ది మహోన్నతమైన దీక్ష అని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు అన్నారు. ఆయన దీక్ష ఫలితంగానే ఇప్పుడు తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై జరిగిన దాడిని తిప్పికొట్టిన ఘనత మలిదశ ఉద్యమంతోనే సాధ్యమైందని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు అన్నారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించలేని పరిస్థితి నుంచి తెలంగాణ అంటే ఆత్మగౌరవం అనే స్థాయికి తీసుకొచ్చిన ఘనత టిఆర్‌ఎస్ దేనన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం నాలుగేళ్ల క్రితం కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష దినాన్ని పురస్కరించుకుని ఇందిరాపార్కు వద్ద టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ దీక్షా దివస్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేస్తే సీమాంధ్ర నేతల కుట్ర కారణంగా 2009లో మళ్లీ వెనక్కిపోయిందన్నారు. ఇప్పుడు తెలంగాణను ఇకెవరూ అడ్డుకోలేరని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు జైత్రయాత్రలు మాని – ఆంక్షలు పెడతామంటున్న అధిష్టానంపై దండయాత్ర చేయాలని సూచించారు. ఎవరూ అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన ఘటన కేసీఆర్‌కే దక్కిందన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణకు వచ్చే వాటాను దక్కించుకునేందుకు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట రాయలసీమ ప్రాజెక్టులను ప్రస్తావించి, తెలంగాణ ప్రాజెక్టులను విస్మరించడంతోనే రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క చుక్క నీటికోసమైనా పోరాడుతామని తెలిపారు. నాలుగు నిమిషాలు కూడా తెలుగు మాట్లాడలేని సీఎం కిరణ్ తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండాలనడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయొద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. సంపూర్ణ తెలంగాణ సాధించేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్ నడిబొడ్డున సభలు, సమావేశాలకు, దీక్షలకు అనుమతినిచ్చిన ప్రభుత్వమే కేసీఆర్ దీక్షను అణచివేయాలని చూసి ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగిన యుద్ధంలో న్యాయం తెలంగాణవైపు ఉంది కాబట్టే గెలిచామని పేర్కొన్నారు. ఇదిలావుంటే తెలంగాణ పది జిల్లాల్లో తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు దీక్షా దివస్‌ను ఘనంగా జరుపుకున్నారు. టీఆర్‌ఎస్ యూత్, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందిరా పార్క్ వద్ద జేఏసీ ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలంగాణను ఏ శక్తి అడ్డుకోలేదు




