పది జిల్లాల తెలంగాణే రాయల తెలంగాణకు ఒప్పుకోం
కాదంటే మరో ఉద్యమం : కోదండరామ్
జాతీయ పార్టీ నేతలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన టీ జేఏసీ
హైదరాబాద్, డిసెంబర్ 1 (జనంసాక్షి) :
హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తప్ప మరో ప్రతిపాదనేది అంగీకరించబోమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కేంద్రం తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చే వేళ రాయల తెలంగాణ, హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతంగా చేయడం తదితర లీకులిస్తూ కాలయాపన చేస్తుండటంతో జాతీయ పార్టీ నేతలను కలిసేందుకు ఆయన నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఆదివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఢిల్లీకి బయల్దేరింది. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లో కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు తెలంగాణ ప్రజలు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. కేంద్రం ఆ దిశలో కనుక ముందుకు వెళ్తే మరో ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు మద్దతివ్వాలని జాతీయ పార్టీ నేతలను కోరుతామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు భారీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారని, రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారని కోదండరామ్ మండిపడ్డారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ విభజన ఆపేందుకు, తద్వార తెలంగాణ ప్రజల ఆకాంక్షను చిదిమేసేందుకు సాగుతున్న కుట్రలను ఢిల్లీలో అన్ని జాతీయ పార్టీలకు వివరిస్తామన్నారు. ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ఆ తర్వాతి పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన వెంట టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్, టీజీవోస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.