కాదంటే మరో సంగ్రామం
కోదండరామ్ హెచ్చరిక
న్యూఢిల్లీ, డిసెంబర్ 4(జనంసాక్షి) :
పది జిల్లాల తెలంగాణే ఏర్పాటు చేయాలని, కాదంటే మరో సంగ్రామం తప్పదని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ హెచ్చరించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తెలంగాణ ఐకాస స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ… భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో తేడా వస్తే తీవ్ర కార్యాచరణ ఉంటుందని కోదండరాం హెచ్చరించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే పది జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్నామని, ఎలాంటి ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణను కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ బంద్‌తోనైనా కేంద్రం తన వైఖరిని మార్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర ప్రజల మధ్య ఐక్యత లోపిస్తుందని కోదండరాం అభిప్రాయపడ్డారు. రాయలసీమలోని రెండు జిల్లాలను విడగొడితే అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమకు 10 జిల్లాల సంపూర్ణ తెలంగాణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక జిల్లా ఎక్కువా వద్దు, ఒక జిల్లా తక్కువా వద్దని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ తెలంగాణ బంద్‌కు టీజేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కోదండరామ్ ఈ సందర్భంగా తెలిపారు. తాము అడగని రాయల తెలంగాణ వద్దే వద్దని కోదండరాం స్పష్టం చేశారు. రాయల తెలంగాణను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. సంపూర్ణ తెలంగాణను కోరుకుంటున్నాం. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణెళి కావాలి. తెలంగాణ ఏర్పాటులో తేడా వస్తే తీవ్ర కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు. సంపూర్ణ తెలంగాణ సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు వద్దని, రాయల తెలంగాణతో రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని కూడా అన్నారు. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని స్టీరింగ్ కమిటీ తీర్మానం చేసిందన్నారు. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా ఇప్పటికే టీఆర్‌ఎస్ బంద్‌కు పిలుపునిచ్చింది. అన్ని పక్షాలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మరోమారు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్ర ఏర్పాటులో తేడా వస్తే చలో అసెంబ్లీకి పిలుపునిస్తామన్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తాం. రాయల తెలంగాణను ఏర్పాటు చేస్తే జరగబోయే పరిణామాలకు కాంగ్రెస్‌దే బాధ్యతన్నారు. పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు టీ కాంగ్రెస్ నేతలు కృషి చేయాలని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, విఠల్, విద్యుత్ ఉద్యోగుల ఐకాస కన్వీనర్ రఘు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు విమర్శించారు. రాయలతెలంగాణ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరింబోమని తెలిపారు. బుధవారం సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు జె.బ్లాక్ నుండి ముఖ్యమంత్రి సి బ్లాక్ వరకు బారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నరేంద్రరావు మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మాత్రమే అంగీకరిస్తామని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు, చేర్పులు చేసినా ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 6న సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సమన్వయం సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు.
పది జిల్లాల తెలంగాణే




