Tuesday, 3 November 2026

రాయల వద్దు

భగ్గుమన్న తెలంగాణ
పది జిల్లాల్లో ర్యాలీలు, నిరసనలు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 4 (జనంసాక్షి) :
కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ ప్రతిపాదనను తీసుకు వచ్చి మరోసారి తెలంగాణ ప్రజలను నయవంచనకు గురిచేస్తుందని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్‌ ఇచ్చిన పిలుపు మేరకు యావత్‌ తెలంగాణలో యువత రోడ్లెక్కి నిరసన బాట పట్టారు. కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు తరగతులను బహిష్కరించి జై తెలంగాణ నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణలోని పది జిల్లాల్లోని ప్రధాన పట్టణాలతోపాటు మండలకేంద్రాల్లో ఈర్యాలీ, ధర్నా కార్యక్రమాలు కొనసాగాయి. విద్యార్థులు, యువత, ఉద్యోగ సంఘాల నేతలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రోడ్డెక్కడంతో మరోసారి జైతెలంగాణ, నో రాయల తెలంగాణ అంటూ రాయల తెలంగాణవద్దు, తెలంగాణముద్దు అంటూ నినాదాలు చేస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. ఒక్కో పట్టణంలో వేలాది మంది యువతీ, యువకులు ర్యాలీలు చేస్తుండడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి, ధర్మారం, చొప్పందండి, రామడుగు, గంగాధర, పెగడపల్లి, సుల్తానాబాద్‌, పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, కమాన్‌పూర్‌, కాటారం, హుజూరాబాద్‌, జమ్మికుంట, వేములవాడ, సిరిసిల్ల, గంభీరావుపేట, ముస్తాబాద్‌, చందుర్తి, కథలాపూర్‌తోపాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కూడా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ఎలాంటి అవాంచనీయ సంఘటనలో చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తును చేపట్టారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోసైతం ఊరూవాడా కదిలింది. కేంద్రప్రభుత్వం దిగివచ్చి పదిజిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని తెలంగాణ వాదులు హెచ్చరించారు. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు రోడ్డెక్కడంతో మరోసారి రహదారులన్నీ గులాబీ మయం అయ్యాయి. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో టిఆర్‌ఎస్‌ నగర పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కమలాకర్‌, నగర పార్టీ అధ్యక్షుడు సర్దార్‌ రవిందర్‌సింగ్‌, నాయకులు హరిశంకర్‌, మధు, హరిప్రసాద్‌తోపాటు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తూ ఊరుకునే పరిస్థితి లేనే లేదన్నారు. మరోసారి భీకర పోరాటానికి నడుం బిగిస్తామని హెచ్చరించారు. ఎవ్వరు అడిగారని రాయల తెలంగాణ ప్రతిపాదనలు తెచ్చారని ప్రశ్నించారు. టిడిపి, బిజెపి, సిపిఐతోపాటు చివరికి కాంగ్రెస్‌ కూడా అదే నిర్ణయానికి వచ్చిందని, తీరా చివరి సమయంలో రాయల తెలంగాణ తీసుకువచ్చి అటు రాయలసీమ వాసులను, ఇటు తెలంగాణ వాదులను కూడా మోసం చేయడమే అవుతుందన్నారు. ఉద్యమంలో బాగంగా గురువారం బంద్‌ను కూడా విజయవంతం చేసి కేంద్రానికి కను విప్పు కలిగిస్తామని హెచ్చరించారు. తెలంగాణ బంద్‌కు వ్యాపార, వాణిజ్య, విద్యాలయాలు సహకరిం చాలని మద్దతివ్వాలని ఎమ్మెల్యే, నగర పార్టీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. కొన్నిచోట్ల ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు కూడా భారీగానే చేరుకుని బందోబస్తు చేపట్టారు.
మళ్లీ వేడెక్కిన ఉస్మానియా క్యాంపస్‌
ఉస్మానియా యూనివర్సిటీ మరోమారు వేడెక్కింది. విద్యార్థుల గర్జనతో దద్దరిల్లింది. ఇంతకాలం తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులు ప్రకటన వచ్చాక మిన్నకున్నారు. అయితే రాయల తెలంగౄణ ప్రకటన వస్తుందన్న నేపథ్యంలో మరోమారు క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఓయూ భగ్గుమంది. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆర్ట్స్‌ కళాశాల నుంచి గన్‌పార్క్‌కు ర్యాలీగా బయల్దేరారు. అయితే గతంలో మాదిరిగానే ఓయూలోని ఎన్‌సీసీ గేటు వద్ద విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు ఎప్పుడు ర్యాలీ తీద్దామన్నా ఇక్కడే అడ్డుకోవడం పోలీసులకు ఆనవాయితీగా మారింది. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. పలువురి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఓయూలో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులను భారీగా మోహరించి వారు బయటకు రాకుండా ముళ్లకంచె అడ్డు వేశారు. ఆంక్షలు లేని పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేయడంతో ఉస్మానియా యూనివర్శిటీలోని ఎన్సీసీ గేట్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓయూ ఆర్ట్స్‌ కళాశాల నుంచి భారీ ర్యాలీగా విద్యార్థులు బైకులపై బయలుదేరారు. ఆ క్రమంలో ఎన్సీసీ గేట్‌ వద్ద విద్యార్థుల బైకు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోట చేసుకుంది. దీంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఓయు వద్ద భారీగా మోహరించడంతో ఎప్పుడు ఏం జరుగుతందో అన్న ఆందోళన నెలకొంది. రాయల తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యార్థులు బుధవారం బైక్‌ ర్యాలీని నిర్వహించాలనుకున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు భారీ ర్యాలీ తీయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎన్‌సిసి గేటు వద్దకు ర్యాలీ చేరుకున్నాక పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. జై తెలంగాణ, రాయల తెలంగాణ వద్దు, రాయల టి ప్రతిపాదనను విరమించుకోవాలని నినాదాలు చేస్తూ విద్యార్థులు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ ర్యాలీలో పదమూడు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. విద్యార్థులు బయటకు వెళ్లకుండా ఎన్‌సిసి గేటు మూసి వేసిన పోలీసులు బారీకేడ్లను, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *