‘ఉస్మానియా’ లోగో మార్చేసిన వలస పాలకులు
హైదరాబాద్, డిసెంబర్ 8 (జనంసాక్షి) :
తెలంగాణ చరిత్రపై వలస పాలకులు మట్టి కప్పారు. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వమే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన హైదరాబాద్ చారిత్రక వారసత్వ సంపదను రేపటి తరాలకు తెలియకుండా సాధ్యమైనంతగా ధ్వంసం చేశారు.
సీమాంధ్రులు సృష్టించిన విధ్వంసం చారిత్రక కట్టడాలు, ప్రపంచ శ్రేణి నిర్మాణాలతోనే ఆగిపోలేదు. దేశంలోనే మొట్టమొదటి ఉర్దూ మాధ్యమ విశ్వవిద్యాలయం, దక్షిణ భారతదేశంలో మూడో యూనివర్సిటీ అయిన ఉస్మానియా యూనివర్సిటీ లోగోనూ గుట్టు చప్పుడు కాకుండా మార్చేశారు. దక్కన్ రాజ్యంలోని యువత చదువులో చక్కటి నైపుణ్యాలు పుణికిపుచ్చుకోవాలనే సదుద్దేశంతో ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా యూనివర్సిటీ అంకురార్పణ చేశారు. 1918లో సాయంకాల కళాశాలగా ఇంటర్మీడియెట్ తరగతులు ప్రారంభించారు. 1921లో డిగ్రీ, 1923లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు. మొదట్లో ఉస్మానియా వర్సిటీని అబిడ్స్‌లోని ఓ భవనంలో ప్రారంభించి, ప్రపంచ శ్రేణి విద్యాసంస్థగా మలచాలనే లక్ష్యంతో మీర్ ఉస్మాన్ అలీఖాన్ తార్నాక ప్రాంతంలో 2400 ఎకరాలు కేటాయించి ఉస్మానియా వర్సిటీ శాశ్వత భవనాల నిర్మాణానికి పూనుకున్నారు. భవనాల నిర్మాణ బాధ్యతను ఆర్కిటెక్ట్‌లు సయ్యద్ అలీ, రజా, నవాబ్ జయంత్‌సింగ్ బహదూర్‌కు అప్పగించారు. వారు ఆ రోజుల్లో అమెరికాలోని కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్, కొలంబియా, బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలను సందర్శించి వాటి స్థాయిలోనే వర్సిటీ భవన నిర్మాణానికి పూనుకున్నారు. ఇందుకు బెల్జియంకు చెందిన ఇ.జెస్సార్‌ను సలహాదారుగా నియమించారు. ఆయన పర్యవేక్షణలోనే లా, ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాల, లైబ్రరీ, సెనేట్ హాల్ భవన నిర్మాణాలు పూర్తి చేశారు. ఆర్ట్స్ కాలేజీ నిర్మాణం 1923 జూలై 5న ప్రారంభమవగా, 1939 డిసెంబర్ 4న పూర్తి చేశారు. అదే రోజు నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వర్సిటీని ప్రారంభించి, అప్పటి విద్యాశాఖ మంత్రి అక్బర్ హైదర్‌ను చాన్స్‌లర్‌గా, నవాబ్ మొహదీయాగర్ జంగ్ బహదూర్‌ను వైస్ చాన్స్‌లర్‌గా నియమించారు. ఓయూ ఆంగ్ల అక్షరాలు మధ్యలో, ఇరువైపులా పట్టీలకు ఉస్మానియా యూనివర్సిటీ అని ఆంగ్లంలో, కింద అదే పేరును ఉర్దూలో రాయించారు. వర్సిటీ లోగోకు పైభాగంలో నిజాం నవాబు కిరీటంలోని తాజ్‌ను ఏర్పాటు చేయించి, దాని కింద ‘నాలేడ్జి ఈజ్ పవర్’ అని ఉర్దూలో రాయించారు. ఉర్దూ భారతీయ భాష. దక్కన్ రాజ్యంలో అధికార భాష. ఎంతో కమ్మనైన భాషగా మహాత్మాగాంధీ, విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్‌లు కీర్తించిన భాష. అలాంటి భాష హైదరాబాద్ చరిత్రకు నిలువెత్తు దర్పణం. అందరూ చెప్తున్నట్టుగా అది ముస్లింల భాష ఎంతమాత్రం కాదు. కానీ దానిని ముస్లిం భాషగా ముద్ర వేసిన వలస పాలకులు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు పెద్ద మనుషుల ఒప్పందంలో ఐదేళ్లపాటు తెలంగాణలో ఉర్దూకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నా విస్మరించి, అన్ని ఉద్యోగాలను సీమాంధ్రులతో నింపేసుకున్నారు. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రాగా, హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర రాజ్యంగానే ఉంది. పటేల్ సైనిక చర్యతో హైదరాబాద్ ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. అప్పటి వరకు హైదరాబాద్ సంస్థానానికి రాజుగా ఉన్న మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్‌కు రాజ్ ప్రముఖ్‌గా నియమించింది. మూడేళ్లపాటు ఆయన ఆ పదివిలో కొనసాగారు. ఆయన రాజ్ ప్రముఖ్‌గా ఉన్న సమయంలోనే ఉస్మానియా వర్సిటీలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వరకు, ఏర్పడిన తర్వాత కూడా ఉస్మానియా వర్సిటీ లోగో నిజాం కాలంలో ఏర్పాటు చేసిందే కొనసాగింది. సీమాంధ్రుల వలస పాలన ప్రారంభమయ్యాక వర్సిటీలోని ఉర్దూ అక్షరాలపై, నిజాం నవాబు కిరీటంలోని తాజ్‌పై వారి కన్నుపడింది. గుట్టు చప్పుడు కాకుండా ఉర్దూలో రాసి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ‘నాలెడ్జి ఈజ్ పవర్’ అనే పదాలను తొలగించారు. తెలుగులో ఉస్మానియా యూనివర్సిటీ, హిందీలో తమసోమా జ్యోతిర్గమయా అని రాయించారు. జాతీయ భాష హిందీ, ప్రాంతీయ భాష తెలుగుకు లోగోలో ప్రాధాన్యం కల్పించాలనే సాకుతో వర్సిటీ స్థాపించినపుడు ఏర్పాటు చేసిన లోగోను పూర్తిగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండో అధికార భాష అయిన ఉర్దూకు మొత్తానికి మొత్తమే ప్రాధాన్యత లేకుండా చేశారు. జ్ఞానమే అధికారం అనే సూక్తినీ పూర్తిగా తొలగించి తమ ఈర్ష్యా రాజకీయాలను ప్రదర్శించారు. 96 ఏళ్లక్రితమే వర్సిటీ స్థాపనకు మీర్ ఉస్మాన్‌అలీఖాన్ 2400 ఎకరాల భూమిని కేటాయించాడు. అంతర్జాతీయ స్థాయి నిపుణులతో అత్యుత్తమ భవనాలు నిర్మింపజేశాడు. నిజాం కేటాయించిన 2400 ఎకరాల్లో 800 ఎకరాలను వివిధ సంస్థలకు బదలాయించిన సీమాంధ్ర పాలకులు, నిజాం ఏర్పాటు చేయించిన వర్సిటీ లోగోనూ మార్చేయడంపై తెలంగాణ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి తరమే కాదు, క్రితం తరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ లోగో అంటే ఇప్పుడున్నదే అనుకుంటారు. కానీ అది మార్చినదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీగా, అతి ప్రాచీన వర్సిటీల్లో ఒకటిగా పేరొందిన ఉస్మానియా చారిత్రక వైభవానికి ప్రతీకైన లోగోను మార్చడం, అది ఎప్పుడు జరిగిందో కూడా తెలంగాణ సమాజానికి తెలియకుండా దాచిపెట్టడం వలస పాలకుల దుర్మార్గానికి, దుర్నీతికి సాక్ష్యం. దేశంలో 29వ కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించబోతున్న వేళ తెలంగాణ పునర్నిర్మాణం మాట్లాడుతున్న నేతలంతా మొదట హైదరాబాద్ ప్రైడ్ ఉస్మానియా వర్సిటీకి పాత లోగో పెట్టేల చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముస్లిం ఫోరం కన్వీనర్ సయ్యద్ రఫీ డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ఆయన వర్సిటీ వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించాడు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ దీనిపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. తెలంగాణ సమాజం ఉస్మానియా లోగో మార్చిన వలస పాలకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ చరిత్రపై మట్టి




