Monday, 2 November 2026

నేడో, రేపో అసెంబ్లీకి బిల్లు

న్యాయ సలహా తీసుకున్న రాష్ట్రపతి
12 రాష్ట్రానికి దిగ్విజయ్‌
అవిశ్వాసానికి సీమాంధ్ర ఎంపీల పాచిక
బుజ్జగిస్తున్న అహ్మద్‌ పటేల్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఒకటి, రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు రానుంది. కేంద్ర కేబినెట్‌ పంపిన బిల్లును పరిశీలించిన రాష్ట్రపతి ప్రణభ్‌ ముఖర్జీ సోమవారం న్యాయ సలహా కోసం పంపారు. సాయంత్రానికి ఆయనకు న్యాయ కోవిదులు కావాల్సిన సమాచారం అందజేశారు. ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం రాత్రి నెల్సన్‌ మండేలా కు నివాళులర్పించేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్తున్న నేపథ్యంలో ఆలోగానే ఆయన బిల్లును ఆంధ్రప్రదేశ్‌ శాసన సభకు పంపారు. రాష్ట్రపతి ఈనెల 11న తిరిగి దేశానికి రానున్నారు. శాసనసభ సమావేశాలు ఈనెల 12న ప్రారంభం కానున్న దృష్ట్యా రాష్ట్రపతి కూడా త్వరగానే బిల్లును పంపనున్నట్లు సమాచారం. రాష్ట్రపతి బిల్లును పంపించే సమయంలో రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చే గడువు విషయంలో ఎన్ని రోజులు ఇస్తారో చూశాకగాని సీమాంధ్రుల ఒత్తిడి తలొగ్గారా లేక సొంతంగా వ్యవహరించారా, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, కేబినెట్‌ ఆశించిన రీతిలో వ్యవహరించారా అనేవిషయం బయట పడుతుందని తెలంగాణవాదులు అంటున్నారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ బిల్లుకు మద్దతు పలికేలా చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ 12న హైదరాబాద్‌కు వస్తున్నారు. కాగా సీమాంధ్ర ప్రాంత ఎంపీలు దింపుడు కళ్లం ఆశను వదల్లేదు. సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు సొంతపార్టీపైనే అవిశ్వాస పాచిక వేశారు. ఆరుగురు ఎంపీలు 190 నిబంధన కింద స్పీకర్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. వాయిదా తర్వాత పార్లమెంటు ఉభయసభలు తిరిగి సమావేశం కాగా లోక్‌సభలో సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు ఆరుగురు యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకరుకు ఇచ్చారు. నోటీసు ఇచ్చిన వారిలో సబ్బంహరి, లగడపాటి రాజగోపాల్‌, హర్షకుమార్‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, సాయిప్రతాప్‌, రాయపాటి సాంబశివరావులు సంతకాలు చేసి ఉన్నారు. పార్లమెంటు సెంట్రల్‌ హాలులో సమావేశమైన ఎంపీలు సొంత పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 190 నిబంధన కింద వీరు స్పీకర్‌కు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. విభజన విషయంలో ప్రభుత్వం నైతికంగా వ్యవహరించలేదని తరవాత ఎంపీ సబ్బం హరి అన్నారు. విభజన విషయంలో పార్టీకానీ, ప్రభుత్వం గానీ నైతికంగా వ్యవహరించలేదని అందుకే అవిశ్వాసం ద్వారా ఎదుర్కోవాలని నిర్ణయించామని సబ్బం హరి పేర్కొన్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ బిల్లు పార్లమెంటుకు వచ్చేవరకు తమ ప్రయత్నం తాము చేస్తూనే ఉంటామన్నారు. విభజన నిర్ణయంపై సీఎం వంటి వ్యక్తి తమకు అండగా ఉన్నారని సబ్బం హరి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని, తమ ప్రయత్నాలను ఎవరూ అనుమానించవద్దని కోరుతున్నానని ఎంపీ సబ్బంహరి అన్నారు. దీంతో సొంత ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు నిర్ణయించారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని స్పీకర్‌ మీరాకుమార్‌కు స్వయంగా నోటీసు అందజేసినట్టు ఎంపీ సబ్బం హరి తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి 55 మంది మద్దతు ఉంటే తప్పనిసరిగా చర్చకు అనుమతించాల్సివుంటుందని తెలిపారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఏం నిర్ణయం తీసుకున్నారో తనకు తెలియదన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే పార్లమెంట్‌ సభ్యత్వం ఉండాలని ఆయన చెప్పారు. అందుకే ఇంతకు ముందు చేసిన రాజీనామాలను ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. ఉదయం రాజీనామాలను ఉపసంహరించుకుని తరవాత అవిశ్వాస నోటీస్‌ ఇచ్చామన్నారు. విభజన విషయంలో పార్టీగానీ, ప్రభుత్వం గానీ నైతికంగా వ్యవహరించలేదని విమర్శించారు. విభజనను అడ్డుకునేందుకు సీఎం తమకు అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ వచ్చి ఆమోదం పొందేంత వరకు అడ్డుకునేందుకు తాము ప్రయత్నాలు చేస్తుంటామన్నారు. విభజనకు వ్యతిరేకంగా అవగింజ అంత అవకాశం దొరికినా ముందుకు వెళతామన్నారు. సమైక్యాంధ్రే తమ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. తమను అనుమానించొద్దని సబ్బంహరి కోరారు. ఇప్పటి వరకు విబజనకు వ్యతిరేకంగా తాము చేసిన ప్రయత్నాలన్నీ వృథా అనుకున్నా ఇప్పుడు అవిశ్వాసంతో ముందుకు వెళతామన్నారు. అయితే ఎంతమంది తమవెంట వస్తారన్నది చెప్పలేమన్నారు. అలాగే ఎవరిని కలిసేది కూడా చెప్పమన్నారు. తమవంతుగా విభజనను అడ్డుకునే ప్రయత్నాలను వదులుకోబోమని అన్నారు. దీనిపై చర్చకు తీసుకునే ముందు సభలో స్పీకర్‌ మద్దతు కోరుతారని అన్నారు. అప్పుడు 50మంది మద్దతు ఉంటే చర్చకు అనుమతిని ఇస్తారని అన్నారు. లేకుంటే తిరస్కరిస్తారని చెప్పారు. ఇదిలావుంటే పార్లమెంటు ఉభయసభలు ంగళవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం రెండుసార్లు వాయిదా పడి తిరిగి 2 గంటలకు ప్రారంభం కాగా లోక్‌సభలో సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు స్పీకర్‌కు యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.
అవిశ్వాసాన్ని అధిగమిస్తాం.. : చాకో
కాంగ్రెస్‌ సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస తీర్మాన అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో స్పందించారు. ఇది ఊహించని పరిణామమైనా సమర్థంగా అధిగమిస్తామని చెప్పారు. అయితే అవిశ్వాస తీర్మానం సభ ముందుకు వచ్చినప్పుడు దానిపై చర్చిస్తామని…అవిశ్వాస తీర్మానం ఫలితం ఏంటనేది ఇప్పుడు ముఖ్యమని మిగతావన్నీ యథావిధిగా జరుగుతాయని వ్యాఖ్యానించారు. విభజనపై సరైన సమయంలో మాట్లాడకుండా… నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడిలా చేయడం సరికాదని అన్నారు. పార్టీ సభ్యుల్లో భిన్నాభిప్రాయాలున్నా అధిష్ఠానం తెలంగాణపై బాహంటంగానే నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇంతగా అందరితో చర్చించి తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ వాదులు వ్యతిరేకించడం తగదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *