Tuesday, 3 November 2026

విపక్షంలో కూర్చుంటాం

ప్రజల పక్షం వహిస్తాం : కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) :
విపక్షంలోనే కూర్చుంటామని, ప్రజల పక్షాన పనిచేస్తామని ఆమ్‌ ఆద్మీపార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంలో కూర్చుంటాం లేదా మళ్లీ ఎన్నికలైనా ఎదుర్కొంటాం తప్ప ఎవరికీ మద్దతు మాత్రం ఇవ్వబోమని ఆయన పేర్కొన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అన్నారు. పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ నివాసంలో జరిగిన కోర్‌ గ్రూప్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. పొత్తు ఉండబోదన్న విషయాన్ని అరవింద్‌ కేజీవ్రాల్‌ ముందే చెప్పారని పార్టీ నేత సిసోదియా గుర్తుచేశారు. పైపెచ్చు, అసలు ఇంతవరకు మద్దతు ఇవ్వాల్సిందిగా తమను ఏ పార్టీ కూడా సంప్రదించలేదని తెలిపారు. తాము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని సిసోదియా చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాలు సాధించిన ఆప్‌.. రెండో అదిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. బీజేపీకి 31 స్థానాలు మాత్రమే వచ్చాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ దశలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యనేతలు.. పార్టీ అధినేత అరవింద్‌ కేజీవ్రాల్‌ నివాసంలో సోమవారం సమావేశం అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరిపారు. కాగా ఢిల్లీలో ఏ పార్టీ మద్దతుతోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని జెయింట్‌ కిల్లర్‌, పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ పేర్కొన్నారు. కాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైతే …కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఫలితాలు వెలువడిన అనంతరం అరవింద్‌ కేజీవ్రాల్‌ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను చరిత్రాత్మకమైనవిగా అభివర్ణించారు. ‘కాంగ్రెస్‌, బీజేపీ వంటి పార్టీలకు స్పష్టమైన సందేశమిది. కులం, మతం, అవినీతి, నేరాలు, ధన, కండ బలాలే ఇప్పటిదాకా ఈ పార్టీలను నడిపించాయి. ఇకనైనా సంస్కరణ బాట పట్టకుంటే ప్రజలే వాటిని ఇంటికి పంపుతారు’ అన్నారు. ఇది ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం కాదని, ప్రజా విజయమని అన్నారు. ఇదిలావుంటే బిజెపి వ్యూహమేంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అది ఎలా మద్దతు కూడగడుతుందన్నది ప్రశ్నగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *