Wednesday, 4 November 2026

జన్‌లోక్‌ కోసం మళ్లీ అన్నా సత్యాగ్రహం

పూణె, డిసెంబర్‌ 10 (జనంసాక్షి) :
జన్‌లోక్‌పాల్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయన స్వగ్రామమైన అహ్మద్‌నగర్‌ జిల్లాలోని రాలేగావ్‌ సిద్ధి లో మంగళవారం ఉదయం దీక్షకు దిగారు. స్థానికంగా ఉన్న గుడి ఆవరణలో ఆయన దీక్షకు చేపట్టారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్తలు, గ్రామస్థులు పలువురు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే లోక్‌పాల్‌ బిల్లును ఆమోదించాలని హజారే డిమాండ్‌ చేశారు.లోక్‌పాల్‌ బిల్లుపై గతంలో సోనియాగాంధీ ఇచ్చిన హామీ వల్లే తాను దీక్ష విరమించానని అన్నా హజారే తెలిపారు. అయితే జన్‌లోక్‌పాల్‌ బిల్లును ప్రవేశపెడతామని చెప్పిన కాంగ్రెస్‌, యూపీఏ ప్రభుత్వం మోసం చేశాయని హజారే ధ్వజమెత్తారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనట్లయితే 2014లో జరగనున్న లోకసభ ఎన్నికల్లో కూడా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే లోక్‌పాల్‌ బిల్లును ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఆమోదిస్తామని కేంద్ర మంత్రి నారాయణ స్వామి తెలిపారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లు కోసం గాంధేయవాది అన్నా హజారే సొంత ఊరైన రాలేగావ్‌సిద్ధిలో నిరశన దీక్ష చేపట్టిన విషయం విదితమే. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే జన్‌లోక్‌పాల్‌ బిల్లును ఆమోదించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *