తెలంగాణ బిల్లు అడ్డుకోలేడు
అసెంబ్లీలో అభిప్రాయాలు మాత్రమే
మంత్రి డీకే అరుణ
న్యూఢిల్లీ, డిసెంబర్ 10 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును అడ్డుకునేంత శక్తి సామర్థ్యాలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేవని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తో సమావేశం ముగిసిన అనంతరం మంగళవారం ఢిల్లీలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు త్వరలోనే అసెంబ్లీకి వస్తుందని మంత్రి డీకే అరుణ తెలిపారు. ఈ సమావేశాల్లోనే బిల్లు పార్లమెంట్‌కు వెళుతుందని అన్నారు. శాసనసభలో తెలంగాణ బిల్లును ఓడించడం ముఖ్యమంత్రి చేతిలో లేదని ఆమె అన్నారు. శాసనసభలో కేవలం తెలంగాణ బిల్లుపై చర్చ మాత్రమే జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఓటింగ్ జరగదని అన్నారు. ఈనెల 12న హైదరాబాద్ వస్తున్నట్లు దిగ్విజయ్‌సింగ్ తనతో చెప్పారన్నారు. తాము విడిపోతామంటే కలిసుందామని సీమాంధ్రులు అనడం ఎంతవరకు సబబు అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చేలోపు బలప్రదర్శనకు తెలంగాణ నాయకులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
సీఎంకంత సీన్ లేదు




