Wednesday, 4 November 2026

చర్చకు మోకాలడ్డిన సీమాంధ్రులు

సభ నేటికి వాయిదా

హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముసాయిదాపై చర్చ జరుగకుండా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు మోకాలడ్డారు. సభలో బుధవారం తెలంగాణ ముసాయిదాపై చర్చ ప్రారంభిస్తామని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ మంగళవారం నిర్వహించిన బీఏసీ సమావేశంలో తెలిపారు. ఈమేరకు ఉదయం శాసనసభ సమావేశం ప్రారంభం కాగానే టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను సభను కొనసాగనివ్వబోమంటూ పేర్కొన్నారు. సభ్యుల తీవ్ర నిరసనల మధ్యే స్పీకర్‌ వాయిదా తీర్మానాలను చదివి వినిపించి వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. వెల్‌లో ఉన్న సభ్యులు ఏమాత్రం సహకరించక పోవడంతో ఒక్కటంటే ఒక్క నిమిషంలోనే సభను గంట వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ సీట్లోంచి వెల్లిపోయారు. అయితే గంట తర్వాత 10.10గంటలకు రెండోసారి చైర్‌లోకి స్పీకర్‌ వచ్చీ రాగానే నినాదాలు పెంచారు. వెల్‌లోకి దూసుకు పోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దీంతో స్పీకర్‌ మరోసారి గంటసేపు వాయిదా వేస్తు న్నట్లు ప్రకటించి వెల్లిపోయారు. అయినా కూడా సీమాంధ్ర ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజనపై చర్చ చేపట్టాలని టీఆర్‌ఎస్‌, బిజెపి, సిపిఐలు వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా, సమైక్య తీర్మానం చేయాలంటూ వైసిపి, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలవైఖరిపై జరుపాలని టిడిపివాయిదా తీర్మాణాలను ఇచ్చాయి. వాటిని స్పీకర్‌ తిరస్కరించారు. రాష్ట్ర విభజనపై బుధవారం ఎలాంటి చర్చ చేపట్టకుండానే వాయిదాల మీద వాయిదాలు పడ్డ తర్వాత గురువారానికి వాయిదాపడ్డాయి. మూడోసారి చైర్‌లోకి వచ్చీ రాగానే అక్కడే అందోళన చేస్తున్న సమయంలో స్పీకర్‌ మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వనేలేదు. ఓవైపు ఆందోళన చేస్తుండగానే సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరిస్తూ స్పీకర్‌ కొట్టాల్సిన బెల్‌ను వారే కొట్టడంతో స్పీకర్‌ సభను గురువారానికి వాయిదా వేశారు.

శాసనమండలి గురువారానికి వాయిదా

రాష్ట్ర విభజన అంశంపై శాసనమండలిలో బుధవారం కూడా ఒక్కటంటే ఒక్క క్షణం కూడా చర్చించకుండానే సభ గురువారానికి వాయిదా పడింది. బుధవారం మండలి చైర్మన్‌ చక్రపాణి సభలోకి వచ్చీ వస్తుండగానే ఉదయం 10 గంటలకు సీమాంద్రకు చెందిన ఎమ్మెల్సీలు సమైక్యాంధ్రపై తీర్మానం చేయాలని, రాష్ట్ర విభజన బిల్లును తిప్పిపంపాలని డిమాండ్‌ చేస్తూ పోడియం చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దీంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితిలో చైర్మన్‌ అరగంట సేపు వాయిదా వేశారు. ఆతర్వాత రెండోసారి సమావేశం ప్రారంభమైనప్పటికి కూడా సభ్యుల ఆందోళనల్లో మార్పురాలేదు. దీంతో చైర్‌లో ఉన్న డిప్యూటి చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ సభను గురువారానికి వాయిదావేశారు. అయితే తెలంగాణ ఎమ్మెల్సీలు తీవ్రంగా వ్యతిరేకించారు. చర్చ జరుపకుండా వాయిదా వేయడం దుర్మార్గమే అవుతుందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *