ఇక బీఏసీ కూడా ఉండదు : శ్రీధర్‌బాబు
హైదరాబాద్, డిసెంబర్ 18 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన బిల్లుపై కేవలం చర్చ మాత్రమే కొనసాగుతుందని, ఇందులో ఎట్టిపరిస్థితిల్లోనూ ఓటింగ్ ఉండనే ఉండదని రాష్ట్ర అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సంబందించి బీఏసీ సమావేశం మంగళవారమే జరిగిందని అదే ఫైనల్ అని అన్నారు. కౌన్సిల్‌లో, అసెంబ్లీలోను సీమాంధ్ర ప్రాంతాల ప్రజాప్రతినిధులు వారివారి ప్రాంతాల సమస్యలపై చర్చించే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. సభ సజావుగా కొనసాగేందుకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ, టీడీపీలు ఆలోచించుకుని తమ ప్రాంతానికి ఏమేం కావాలో బిల్లుపై సబ్జెక్ట్ వారిగా అభిప్రాయం చెప్పాలని సూచించారు. సభలను సజావుగా జరిపించేందుకు స్పీకర్, మండలి చైర్మన్‌లపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు అభిప్రాయం చెప్పాల్సి ఉందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరడం సరికాదన్నారు. చర్చలో పాల్గొన్నప్పుడు ఏంకావాలో డిమాండ్ చేసుకోవచ్చన్నారు. ఏ ఒక్క అంశంపై కూడా ఓటింగ్ అనేది ఉండ దన్నారు. ప్రతి ఒక్కరు సహకరించాల్సిందేనన్నారు.




