కొత్త రాష్ట్రాల డిమాండ్ ఊపందుకుంది : రాష్ట్రపతి ప్రణబ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 19 (జనంసాక్షి) :
అవినీతి అంతానికి అన్నా హజారే చేపట్టిన ఉద్యమం దేశంలో కొత్త కోణాల్ని ఆవిష్కరించిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఇంటెలిజెన్స్ బ్యూరో సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్నా ప్రారంభించిన ఉద్యమం దేశంలోని యువతనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను కదిలించిందని అన్నారు. ఈ సందర్భంగా కొత్త రాష్ట్రాల డిమాండ్లపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తున్నాయన్నారు. ఆయా రాష్ట్రాల ఏర్పాటులో రాజకీయంగా, పరిపాలనా పరంగా విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. పెరుగుతున్న జనాభా, అవసరాల రీత్యా ప్రజలందరినీ ఒకేచోట కలిపి ఉంచడం సాధ్యం కాదని ప్రణబ్ అన్నారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేలా నైపుణ్యాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రణబ్ ఢిల్లీలో జరిగిన నిఘావర్గాల అధికారుల సమావేశంలో మాట్లాడారు. కాగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిదికి గురువారం సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. ఈ దశలో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పరోక్షంగా ఆయన కొత్త రాష్ట్రాల డిమాండ్‌ను సమర్థించడం విశేషం. ఈ నెల 31వ తేదీ వరకు ఆయన ఇక్కడే ఉంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి రెండు వారాలు బస చేస్తున్నారు. ఇక్కడి నుంచే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, ఇతర రాష్ట్రాల్లో పర్యటించి తిరిగి హైదరాబాదుకే వస్తారు. ఆంధప్రదేశ్ పునర్విభజన బిల్లును నిరసిస్తున్న సమైక్యవాదుల నుండి నిరసనల వ్యక్తమయ్యే అవకాశమున్న నేపథ్యంలో ప్రణబ్ పర్యటన సజావుగా సాగేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై బుధవారం రిహార్సల్స్ నిర్వహించారు. ప్రణబ్ కార్యక్రమాలకు ప్రత్యేక హెలికాప్టర్ వినియోగిస్తారు.
హజారే ఉద్యమం కొత్త కోణాల్ని ఆవిష్కరించింది




