ప్రధానిని కోరిన అఖిలపక్షం
హామీ ఇవ్వని ప్రధాని
ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వండి
న్యూఢిల్లీ, డిసెంబర్ 20 (జనంసాక్షి) :
బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పును పునఃసమీక్షించాలని రాష్ట్రానికి చెందిన అఖిలపక్ష బృందం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కోరింది. ట్రైబ్యునల్ తీర్పును గెజిట్‌లో నోటిఫై చేయొద్దని, రాష్ట్రానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నివాసంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షనేతలు ప్రధానితో భేటీ అయ్యారు. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని వివరించారు. సమావేశం ముగిసిన అనంతరం వెలుపలకు వచ్చిన అఖిల పక్ష నేతలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. అఖిలపక్ష నేతల వాదనలను ప్రధాని మన్మోహన్‌సింగ్ శ్రద్దగా విన్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలిపారు. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పునకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను తనకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అఖిలపక్ష నేతల విన్నపాలపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మన్మోహన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. అఖిలపక్షం ఎంతగా కోరినా ప్రధాని మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదు.
ఇబ్బందులొస్తాయి : జానారెడ్డి
బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పు వల్ల దేశంలోనే గాక రాష్ట్రంలోనూ తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రధానికి వివరించానని మంత్రి జానారెడ్డి అన్నారు. ఇబ్బందులను తొలగించి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని కోరినట్టు వెల్లడించారు.
పిటిషన్‌లో ఇంప్లీడ్ కావాలి : రావుల
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై రాష్ట్ర పిటీషన్‌లో ఇంప్లీడ్ కావాలని ప్రధానిని కోరామని, అందుకు పరిమితులు ఉన్నాయని ప్రధాని చెప్పారని టిడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి తెలిపారు.ట్రిబ్యునల్ తీర్పును పరిశీలించాలని సిడబ్ల్యుసిని కోరనున్నట్టు ప్రధాని హామీ ఇచ్చారని అన్నారు. కొత్త ట్రిబ్యునల్ మిగులు జలాలను పంపిణీ చేయడం వల్ల హక్కులు కోల్పోయామని వెల్లడించినట్టు చెప్పారు.
కింది రాష్ట్రాలకే హక్కు ఉండాలి : కోడెల
బ్రిజేశ్ వల్ల రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ప్రధానికి వివరించామని టీడీపీ నేత కోడెల శివప్రసాద్ అన్నారు. మిగులు జలాలపై రాష్ట్రాలకే హక్కు కల్పించాలని కోరాం. బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పును గెజిట్ చేయొద్దని విజ్ఞప్తి చేశామని చెప్పారు.
ప్రాణహిత, చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలి : వినోద్
పోలవరం ప్రాజెక్టును జాతీయ పార్టీగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేశానని టిఆర్‌ఎస్ నేత వినోద్ అన్నారు. అలాగే ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పిస్తే తెలంగాణ ప్రజలకు మరింత మేలు చేసినవారవుతారని చెప్పానన్నారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పును పునఃసమీక్షించాలని కోరానన్నారు. తెలంగాణ వచ్చాక నీటి కేటాయింపులపై పోరాడుతా మని చెప్పారు. బ్రిజేష్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడం మినహా మరోమార్గం లేదని అన్నారు.
తీర్పును సవరించాలి : బీవీ
బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పును సవరించాలని కోరినట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు తెలిపారు.బచావత్ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరాం. బ్రిజేష్ ట్రిబ్యునల్ కొత్త పద్ధతులను అవలంభించిందని, దాని వల్ల రాష్ట్రంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పాం. తీర్పు పర్యవసానాలపై అధ్యయనం చేయిస్తామని హామీ ఇచ్చారు. న్యాయం జరిగే వరకు ఇలాగే పోరాడుతామని చెప్పారు.
న్యాయం చేయండి : జూలకంటి
బ్రిజేష్ తీర్పు వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఆ తీర్పుపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరినట్టు సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
మహబూబ్‌నగర్,నల్గొండలను ఆదుకోండి : నాగం
బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై పునః సమీక్షించాలని ప్రధానిని కోరినట్టు బిజెపి నేత నాగం జనార్దనరెడ్డి అన్నారు. ఆ తీర్పుపై పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు జోక్యం చేసుకోవాలని, న్యాయం చేయాలని కోరానని అన్నారు. విజ్ఞప్తి పత్రాన్ని కూడా అందజేశామన్నారు. అంతేగాక మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు నీటిని కేటాయించి ఆదుకోవాలని కోరానని చెప్పారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, పూర్తయిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపు జరగడం లేదని అన్నారు. నీటి పంపకంలో 65శాతం డిపెండబులిటీ అంటే రాష్ట్రానికి తీరని నష్టమని అన్నారు. 75శాతం లభ్యత ప్రాతిపదికనేే నీటిపంపిణీ జరగాలని కోరారు.
అనేక లోపాలు : గుండా మల్లేశ్
బ్రిజేశ్ ట్రైబ్యునల్ తీర్పులో అనేక లోపాలున్నాయని ప్రధానికి చెప్పామని సీపిఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ అన్నారు.బచావత్‌అవార్డుకు విరుద్ధంగా బ్రిజేష్ తీర్పు ఉందని చెప్పాం. బ్రిజేష్ ట్రిబ్యునల్‌ను రద్దుచేస మరో ట్రిబ్యునల్‌ను ప్రకటించాలని కోరినట్టు వెల్లడించారు.
75శాతం నీటి లభ్యత ప్రాతిపదకనే : ఉమ్మారెడ్డి
గతంలో మాదిరిగా 75శాతం నీటి లభ్యత ప్రాతిపదికననే నీటి పంపిణీ జరగాలని ప్రధానిని కోరినట్టు వైఎస్‌ఆర్‌సిపి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. 75శాతం కంటే తగ్గితే దేశవ్యాప్తంగా అనేక సమస్యలు వస్తాయని కూడా వివరించామన్నారు. ఒక వినతి పత్రం కూడా అందజేశామని చెప్పారు. ప్రధాని నివాసంలో జరిగిన అఖిలపక్ష భేటీలో కేంద్ర జలవనరులశాఖ మంత్రి హరీష్ రావత్, ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పార్ధసారధి, టీడీపీ నుండి కోడెల శివప్రసాద్, రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్, సీపీఎం కోరానన్నారు.తెలంగాణ వచ్చాక నీటి కేటాయింపులపై పోరాడుతా మని చెప్పారు. బ్రిజేష్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడం మినహా మరోమార్గం లేదని అన్నారు.
క్షమాపణ చెప్పం.. కేసులు ఎత్తివేయం
దేవయాని ఉదంతంపై మొండికేసిన అమెరికా
వాషింగ్టన్, డిసెంబర్ 20 (జనంసాక్షి) :
దేవయాని ఉదంతంలో భారత్‌కు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరి హార్ఫ్ తేల్చిచెప్పారు. ఆమెపై కేసులు కూడా ఎత్తివేయబోమని ఆమె పేర్కొన్నారు. దేవయాని ఘటనలో తాము సరిగానే వ్యవహరించారని ఆమె పేర్కొన్నారు. భారత్ క్షమాపణ కోరడం సరికాదన్నారు. ఆమె చట్టాన్ని అతిక్రమించింది కాబట్టే అరెస్టు చేయాల్సి వచ్చిందని చెప్పారు. కాగా దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే వ్యవహారంపై పరిష్కారం కనుగొంటామని భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికాకు గట్టిగా సందేశం పంపామని అన్నారు. ఇప్పటికే తమ నిరసనను తెలియజేశామని అన్నారు. అయితే అమెరికా, భారత్ సంబంధాలను కాపాడుకోవడంతో పాటు ఈ వ్యవహారంలో సరైన పరిస్కారం కనుగొనేలా చూస్తామన్నారు. అమెరికాతో సంబంధాలు కాపడుకోవడం కూడా ముఖ్యమేనని, ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. దేవయానిపై అభియోగాలు ఉపసంహరించుకోబోమన్న అమెరికా ప్రకటనపై స్పందించేందుకు ఖుర్షీద్ నిరాకరించారు. అయితే అమెరికా సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటుందన్న అశాభావం వ్యక్తంచేశారు. ఇదిలావుంటే మరో పక్క అమెరికా ఈ విషయంలో తమ అభిప్రాయానికి కట్టుబడి ఉండేందుకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేవయాని మీద అభియోగాలు ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌ని తిరస్కరించినట్లు అమెరికా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అది చట్టాన్ని అమలు చేసే విషయమని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయ దౌత్యవేత్త దేవయానిపై అమెరికా వ్యవహరిస్తున్న తీరు పట్ల కేంద్ర పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి కమల్‌నాథ్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేవయానిపై నమోదు చేసిన కేసును వెంటనే ఉప సంహరించుకోవాలని ఆయన అమెరికాను డిమాండ్ చేశారు. అలాగే ఆమెను తనిఖీ చేసే క్రమంలో ఆ దేశ ఉన్నతాధికారు వ్యవహరించిన తీరు పట్ల ఆయన మండిపడ్డారు. భారతీయులపై తరచుగా అమెరికా తనిఖీల పేరిట నిర్వహిస్తున్న సోదాలను ఖండించారు. అమెరికా చర్యలను ఎంత మాత్రం సహించేది లేదని కమల్నాథ్ స్పష్టం చేశారు. హార్ఫ్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటని విలేకర్లు కమల్‌నాథ్‌ను ప్రశ్నించగా ఆయనపై విధంగా స్పందించారు. మరోవైపు భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాదేపై కేసును ఉపసంహరించే ప్రసక్తే లేదని అమెరికా ఖరాకండిగా చెప్పింది. ఆ విషయంలో క్షమాపణలు కూడా చెప్పబోమని స్పష్టం చేసింది. తమ దేశ దౌత్యవేత్త పట్ల ఆమెరికా వ్యవహరించిన తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై వెంటనే క్షమాపణలు చెప్పాలని, అలాగే దేవయానిపై నమోదైన కేసును యుద్ధ ప్రాతిపదికన ఉపసంహరించాలని భారత్ చేసిన డిమాండ్‌ను అమెరికా తోసిపుచ్చింది. విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హర్ఫ్ శుక్రవారం వాషింగ్టన్లో వెల్లడించారు. దేవయానిపై నమోదైనది అషామాషీ కేసు కాదని మేరీ అభిప్రాయపడ్డారు. అయితే ఆమెను ప్రాసిక్యూట్ చేస్తారో, లేదో తనకు తెలియదని చెప్పారు. ఈ అంశంపై అమెరికా కోర్టులు ఏమైనా స్పందిస్తే అప్పుడు ఆలోచిస్తామని తెలిపారు. కోబ్రగడే 1999 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారిణి. న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయంలో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. ఇంట్లో సహాయకారిగా ఉండేందుకు భారత్‌లో నుంచి సంగీత రిచర్డ్‌ను నెలకు రూ. 30 వేల జీతంతో పనిమనిషిగా పెట్టుకున్నారు. దేవయాని మూల వేతనమే రూ.26 వేలు కావడం ఇక్కడ గమనార్హం. 2012 నవంబర్ 23న సంగీత న్యూయార్క్ వెళ్లారు. అయితే అక్కడ ఖాళీ సమయంలో తాను వేరే ఉద్యోగం చేసేందుకు అనుమతించాలని దేవయానికి కోరింది. అందుకు యూఎస్ చట్టాలు
అనుమతించవని సంగీతకు దేవయాని వివరించింది. ఈ క్రమంలో దేవయాని ఇంటి నుంచి సంగీత పరారైంది. ఆ క్రమంలో దేవయాని మరియు సంగీత దంపతుల మధ్య చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో దేవయానిపై యూఎస్ లో కేసు నమోదు అయింది. అంతేకాకుండా దేవయానిని తనిఖీ చేసే క్రమంలో ఉన్నత అధికారి అనే విషయాన్ని మరిచి యూఎస్ అధికారులు ప్రవర్తించారు. దీంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవయానిపై కేసు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని యూఎస్ ను భారత్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
బ్రిజేశ్‌కుమార్ తీర్పును పున: సమీక్షించండి




