Tuesday, 3 November 2026

ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ

2014లోపే కొత్త రాష్ట్రం
సీమాంధ్రులు బిల్లుపై చర్చించండి
అన్ని పార్టీలు ఆమోదించాయి : దిగ్విజయ్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) :
పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం 2014 ఎన్నికల్లోపు ఏర్పడుతుందని దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందనున్నట్టు తెలిపారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు అఫిడవిట్లు ఇచ్చేబదులు అసెంబ్లీలో బిల్లుపై చర్చలో పాల్గొంటే బాగుంటుందని, న్యాయం జరుగుతుందని సూచించారు. రాజకీయం వేరు.. పరిపాలన వేరు.. ఆ రెండింటిని కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ విడివిడిగానే చూస్తుందని స్పష్టం చేశారు. ఆ రెండింటిని కలిపి చూడడం మంచి పద్ధతి కాదని అన్నారు. అన్ని పార్టీలు చెప్పిన తర్వాతే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజనపై తుదినిర్ణయం తీసుకుందని అన్నారు. నిర్ణయంపై పలు పార్టీలు వెనక్కి వెళ్లినా కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని అన్నారు. సీఎం కిరణ్‌ స్వతహాగా క్రికెటర్‌ కావడంవల్ల ఆఖరి బంతి ఎప్పుడొస్తుందో ఆయనకు తెలిసినందునే ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో తమ పార్టీ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన మాటకోసమే తెలంగాణ ఏర్పాటు చేస్తున్నాం తప్ప రాజకీయాల కోసం ఏమాత్రం కాదన్నారు. అన్నీ పార్టీలు వెనక్కు తగ్గినా తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ మాత్రం వెనక్కుపోదని తెలిపారు. కిరణ్‌ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించాలని దిగ్విజయ్‌ను మీడియా ప్రతినిధులు కోరగా, తానైతే ఆయన కాంగ్రెస్‌ను వీడుతారనుకోవడం లేదని, కొత్త పార్టీ వార్తలపై ఆయన్నే అడగాలని బదులిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *