Tuesday, 3 November 2026

సంపూర్ణ తెలంగాణ కోసం మరో సంగ్రామం

టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) :
సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరో సంగ్రామానికి సిద్ధమని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్నదని కేసీఆర్‌ పేర్కొన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం రూపొందించిన 2014 క్యాలెండర్‌, డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఎవ్వరూ ఆపలేరని అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో సవరణలు చేసిన అనంతరమే బిల్లు పార్లమెంట్‌లో పెట్టాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తెలంగాణవాదులంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా సీఎంతో పాటు సీమాంధ్ర నేతలు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది మంచిది కాదని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలకు ఏమి కావాలో ఆ ప్రాంత నేతలు కోరుకోవాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఉద్యమంలో ఉద్యోగులు ఎనలేని పాత్రపోషించారని, అన్ని స్థాయిల్లో ఉద్యోగులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారని అన్నారు. తాను దీక్ష బూనినప్పుడు తెలంగాణ ఉద్యోగులు పెన్‌డౌన్‌ చేశారని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌పై గవర్నర్‌ పెత్తనమేమిటని ప్రశ్నించారు. ఎలాంటి ఆంక్షలులేని తెలంగాణ కోసమే తాము ఉద్యమం చేపట్టామని అన్నారు. దేశంలోని 28 రాష్ట్రాలకు లేని ఆంక్షలు కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ రాష్ట్రానికి ఎందుకని, దీనిపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణపై ఆంక్షలను ఎత్తివేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు తరహాలో తెలంగాణలో కూడా జాతీయ హోదాగల ప్రాజెక్టును నిర్మించాలని కోరారు. తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీకి పంపడంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ చివరి అంకానికి చేరిందని అన్నారు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఇక రాష్ట్ర ప్రక్రియ ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడే వరకు సీమాంధ్ర నేతల కుట్రలకు ఎవ్వరూ బలి కావద్దన్నారు. సీమాంధ్ర నేతలకు దీటుగా తెలంగాణ నేతలు కూడా లాబీయింగ్‌ చేయాలన్నారు. సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం సాధించేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టంచేశారు. జనవరి 3వ తేదీన ఇందిరాపార్కు వద్ద ఆంక్షలులేని తెలంగాణ రాష్ట్రం కోసం భారీ ఎత్తున ధర్నా చేపడనున్నట్టు, ఇందులో తెలంగాణవాదులు, ప్రజలు పాల్గొని తమ సత్తా ఏమిటో తెలపాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఎంపీ ప్రభాకర్‌ పాత్ర ఆమోఘమని అభినందించారు. తెలంగాణ జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ, తెలంగాణ సాధనతోనే ఉద్యమ ప్రస్థానం ఆగిపోదని, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ కీలక భూమిక పోషిస్తామని చెప్పారు. ఎలాంటి షరతులు లేని తెలంగాణ సాధనే తమ అభిమతన్నారు. కార్యక్రమంలో కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, స్వామిగౌడ్‌, దేవీప్రసాద్‌, విఠల్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *