చలికి తట్టుకోలేక చిన్నారుల మృతి
నోరు పారేసుకున్న యూపీ సీఎస్
ఆచితూచి మాట్లాడాలన్న అఖిలేశ్
లక్నో, డిసెంబర్ 27 (జనంసాక్షి) :
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ పునరావాస కేంద్రాల్లో మరణ మృదంగం మోగుతోంది. పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు లేక, ఎముకలు కొరికే చలిని తట్టుకోలేక చిన్నారులు మృత్యువాతపడుతున్నారు. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి డిసెంబర్ 20 వరకు ముజఫర్‌నగర్ సహాయ శిబిరాల్లో తలదాచుకున్న చిన్నారుల్లో 34 మంది మృత్యువాతపడ్డారు. అయితే వీరి మృతిపై ఉత్తరప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే గుప్తా స్పందిస్తూ సహాయ శిబిరాల్లో చిన్నారులెవరూ చలి కారణంగా మరణించలేదని, అలా అయితే ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతమైన సైబీరియాలో మనుషులెలా జీవించడలుగుతారని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలపై భాజపా, కాంగ్రెస్ మండిపడ్డాయి. భాజపా అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ స్పందిస్తూ పాలనాయంత్రాంగం మొరటుగా తయారైనప్పుడే ఇటువంటి వ్యాఖ్యలు వస్తాయని పేర్కోన్నారు. యూపీ కాంగ్రెస్ నేత అఖిలేష్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ గుప్తా వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవన్నారు. గుప్తాను తక్కువ దుస్తులతో చలిలో ఉంచాలంటూ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో వ్యాఖ్యలు చేసేముందు జాగ్రత్త వహించాలని, వాటి వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినరాదని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధికారులకు సూచించారు.
ముజఫర్‌నగర్ పునరావాస కేంద్రాల్లో మరణ మృదంగం




