సభ ఉల్లంఘన నోటీసిస్తాం
జగన్‌పై గండ్ర ఫైర్
వరంగల్, డిసెంబర్ 27 (జనంసాక్షి) :
స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై నోరు పారేసుకుంటావా అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే సభా హక్కుల నోటీసు ఇస్తామని హెచ్చరించారు. వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు చట్టసభలపై అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ పదవిని గౌరవించడం నేర్చుకోవాలని గండ్ర హితవు పలికారు. జనవరి 3వ తేదీన సభా హక్కుల నోటీస్ ఇస్తామన్నారు. మాట తప్పం మడమ తిప్పం అంటున్న వైసిపి ఇప్పుడు ప్రతి చర్యలోనూ మాట తప్పుతూనే ఉందన్నారు. జగన్ స్పీకర్‌కు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్ బలంగానే ఉందన్నారు. టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కావాల్సినవసరం లేదన్నారు. విలీనమనే వ్యవహారాన్ని కేసి ఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. సీమాంధ్రులు ఇప్పటికైనా తమ వాదనను ముగించుకుని సీమాంధ్ర అభివృద్దికోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆపేసత్తా, శక్తి ఒక్కరికి కూడా లేదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తూ ఇరు ప్రాంతాల ప్రజలను మోసంచేస్తున్నారని ఆరోపించారు. బిల్లులో అభ్యంతరాలుంటే అసెంబ్లీలో చర్చించాలన్నారు. తెలంగాణలో టిడిపి దుఖాణం మూసేసినట్లేనన్నారు. సమన్యాయం పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్న చంద్రబాబు నాయుడుకు తగిన గుణ పాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలోనే ఆయన కూడా జగన్‌లాగే సమైక్యవాదం వైపు మళ్లడం ఖాయమన్నారు. టిటిడిపి నేతలు ఇప్పటికైనా పార్టీని వీడి తెలంగాణ ప్రజలపక్షాన నిలబడాలన్నారు. టిటిడిపి నేతలు కాంగ్రెస్‌లోకి వస్తానంటే స్వాగతం పలుకుతామన్నారు. టిడిపి నేతలు భవిష్యత్‌ను చూసుకుని ముందుకు అడుగులు వేయాలని హితవు పలికారు.
స్పీకర్‌పై నోరు పారేసుకుంటావా?




