Tuesday, 3 November 2026

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది

కానీ.. అధిష్టానమే ఫైనల్‌ : బొత్స
ఆవిర్భావ దినోత్సవానికి సీఎం డుమ్మా
వీహెచ్‌ ఫైర్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 (జనంసాక్షి) :
పార్టీలో ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుందని, కానీ అధిష్టానమే ఫైనల్‌ అని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం గాంధీ భవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ 129వ ఆవిర్భావ దినోత్సవంలో బొత్స పార్టీ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డొక్కా మాణిక్య వరిప్రసాద్‌, జానారెడ్డి, దానం నాగేందర్‌, ఎంపీలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, గత 128 సంవత్సరాల నుంచి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఎనలేని సేవలను అందిస్తోందని అన్నారు. ప్రజలకు న్యాయం జరగడమే కాంగ్రెస్‌ లక్ష్యమని ఆయన అన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేతులు స్వేచ్ఛగా ఆలోచించినా పరస్పరం అభిప్రాయాలు పంచుకుని సమష్టిగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలు కాంగ్రెస్‌ పార్టీ పటిష్టత కోసం దేశ ప్రజల సంక్షేమం కోసం ఎనలేని త్యాగాలు చేశారని, వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని ఆయన కోరారు. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోయే తత్వం కాంగ్రెస్‌ది కాదని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తోందని ఆయన అన్నారు. ప్రజల హృదయాల్లో పార్టీకి చెక్కుదరని స్థానం ఉందని ఆయన అన్నారు. పార్టీ సిద్ధాంతాలతోనే ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీకి మంచి గుర్తింపు ఉందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని బలహీన పరిచేందుకు కొన్ని దుష్ట శక్తులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు పాటు పడాలని ఆయన కోరారు. 2014 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరు శ్రమించాలని బొత్స పిలుపునిచ్చారు. కాగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గైర్హాజరయ్యాడు.దీనిపై రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు, దశా, దిశ నిర్దేశం చేసే నాయకులే పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి రాకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రాకపోవడంతో కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన అన్నారు. పార్టీ పటిష్టత కోసం త్యాగాలు చేసిన కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయడం ముఖ్యమంత్రికి తగదని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్‌ పార్టీ దయతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి తలదురుసుతనంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీ పటిష్టతకు రాహుల్‌ గాంధీ ఆదేశాలను కాంగ్రెస్‌ సంస్కృతిని ముఖ్యమంత్రి పాటించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో హాజరుకాలేదో తనకు తెలియదని, అయితే సీఎం రాకపోవడంతో నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహపడతారన్నారు. పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం సరికాదని ఆయన అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్‌ గాంధీ చేస్తున్న కృషిని వీహెచ్‌ అభినందించారు. అవినీతికి దూరంగా ఉండాలని రాహుల్‌ గాంధీ సూచనలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాటించాలని ఆయన కోరారు. సీఎం పదవి నుంచి దిగిపోతున్నారన్న తొందరలో ఇష్టారాజ్యంగా ఫైళ్లపై సంతకాలు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. గతంలో కొందరు ముఖ్యమంత్రులు పదవుల్లోంచి దిగినాకూడా ఫైళ్లపై సంతకాలు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆ కోవలోకి కిరణ్‌వెళ్లవద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *