26 మంది సజీవ దహనం
అగ్నికి ఆహుతైన బీ1 ఏసీ బోగీ
24 మంది గుర్తింపు
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం
ఘటన స్థలానికి రైల్వే మంత్రులు ఖర్గే, కోట్ల
అనంతపురం, డిసెంబర్ 28 (జనంసాక్షి) :
ఎందరి ప్రాణాలను బలితీసుకున్నా రైల్వే శాఖ అధికారుల తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. అగ్ని ప్రమాదాలు ఎందరినో బలితీసుకుంటున్నా రక్షణ చర్యలు చేపట్టడం లేదు. కనీస భద్రతా ప్రమాణాలు లేని మన రైళ్లు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తున్నా పాలకులూ స్పందించడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయడం తర్వాత పట్టించుకోకపోవడం మన దేశంలో షరా మామూలుగా మారింది. ఘోర రైలు ప్రయాణంతో శనివారం తెల్లారింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలు బుగ్గయ్యాయి. అగ్నికీలల్లో పడి బూడిదయ్యాయి. అనంతపురం జిల్లా కొత్త చెరువు రైల్వేస్టేషన్లో నాందేడ్- బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీ బీ-1లో మంటలు చెలరేగటంతో 26 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ధర్మవరం ఆసుపత్రికి తరలించారు. మంటలు రెండో బోగీకి కూడా వ్యాపించాయి. ఇందులో 12 మంది పురుషులు,12 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రెండో బోగీలో 72మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా అప్రమత్తమై కిందికి దిగారు. రెండు బోగీల నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మవరం నుంచి సహాయ సిబ్బందితో అధికారులు ప్రత్యేక రైలులో బయల్దేరినట్టు సమాచారం. శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో రైల్లో మంటలు చెలరేగాయి. మరికాసేపట్లో పుట్టపర్తి స్టేషన్‌ను చేరుకోవాల్సిన రైలు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. తెల్లవారుజామున 3.10 గంటల సమయంలో బోగీలో షార్టు సర్క్యూట్ కారణంగా కొత్తచెరువు రైల్వేటన్నెల్ సవిూపంలోకి రాగానే ప్రమాదం చోటుచేసుకుంది. బోగీలో మొత్తం 62 మంది ప్రయాణిస్తుండగా 24మంది పెద్దలు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 26మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. 26 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. జిల్లా రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, రైల్వే అధికారులు హుటాహటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి, ఎం.పి అనంత వెంకట్రామిరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడి ప్రమాదం వివరాలను తెలుసుకున్నారు. నాందేడ్- బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో మృతి చెందినవారి దేహాలను రైల్వే అధికారులు బెంగళూరుకు తరలిస్తున్నారు. కుటుంబసభ్యుల ద్వారా మృతులను గుర్తించేందుకు వీలుగా బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయామూర్తి, విజేత, నటేష్, తనూశ్రీలకు అనంతపురం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తనూజ, ధనేంద్ర, నరహరిలకు చికిత్స అనంతరం అధికారులు ఇంటికి పంపివేశారు. అనంతపురం జిల్లా కొత్త చెరువు వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందజేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
బాత్రూమ్ కిటికీ పగులగొట్టి బయటపడ్డ ప్రయాణికులు
అనంతపురం జిల్లా కొత్తచెరవు వద్ద జరిగిన రైలు ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. జరిగిన ఘటనను వివరిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగడంతో బోగీ అంతా పొగ వ్యాపించి ఏం జరుగుతుందో తెలియలేదన్నారు. చివరికి బాత్రూమ్ కిటికీ అద్దాలు పగుల గొట్టి దాదాపు 30 మంది ప్రయాణికులం బయటపడ్డామని వారు వివరించారు. ప్రమాదంలో ఇద్దరు కర్నూలు జిల్లా ఆదోని వాసులు ఉన్నట్లు గుర్తించారు. ఆదోనికి చెందిన బసవరాజు, సర్వమంగళం ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. డి.1 ఏసీబోగీలో ప్రయాణిస్తున్న 23 మంది ప్రయాణికుల మృతదేహాలు మాంసపు ముద్దల్లా మారాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఏసీ బోగీలో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో ఇద్దరు చిన్నారులతో సహా 26 మంది సజీవదహనమయ్యారు. మృత దేహాలు గుర్తు పట్టడానికి కూడా వీల్లేకుండా పూర్తిగా కాలిపోయాయి. డి.1 బోగీ పూర్తిగా దగ్ధంకాగా, మరో బోగీ పాక్షికంగా దగ్ధమైంది.
దూకిన ప్రయాణికులకు తీవ్రగాయాలు
నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో గాయాలతో బయటపడిన వారు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చెన్నైకు చెందిన మూడేళ్ల చిన్నారి తనుశ్రీకి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు నిఖిత, నటేష్‌లు గాయపడ్డారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. బెంగళూరుకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్లు విజిత, తనూజలు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిద్దరూ చికిత్స అనంతరం బెంగళూరు వెళ్లారు. మంత్రాలయం వెళుతున్న విజయ అనే మహిళ బోగీలో మంటలు చెలరేగిన వెంటనే కదులుతున్న రైలు నుంచి కిందికి దూకడంతో బలమైన గాయాలయ్యాయి. తొలుత ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. అనిల్ అనే ప్రయాణికుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
షార్ట్ సర్క్యూటే కారణమా?
ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. బాధితులకు సమాచారమందించేందుకు రైల్వేశాఖ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. క్షతగాత్రులు, మృతుల సమాచారం కోసం బెంగళూరు హెల్ప్‌లైన్ 080 2235 4108, 080 2225 9271, 080 2215 6554 నెంబరుకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
రైలు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
అనంతపురం రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఘటనపై రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గేతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ప్రమాద ఘటనపై విచారణ జరిపించాలని మంత్రిని ప్రధాని ఆదేశించారు. నాందేడ్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద స్థలాన్ని మంత్రి రఘవీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. అధికారులను, ప్రయాణికులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గె రూ. 5లక్షలను ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, క్షతగాత్రులకు రూ. 50వేలు ఆర్థిక సహాయం, ఉచితంగా వైద్య సేవలు అందిచనున్నట్లు తెలిపారు.
ప్రమాదంపై ప్రత్యేక కమిటీతో విచారణ : కోట్ల
రైల్వేలో నిర్వహణ లోపాలుంటే సరిదిద్దుకుని భద్రతా చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ప్రమాదంపై ప్రత్యేక కమిటీతో విచారణకు ఆదేశించామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ప్రమాద కారణాలు తెలిసిన తరవాత తగుచర్యలు తీసుకుంటామని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని సీఎం ఆదేశించారు. తక్షణ సాయక చర్యల్లో పాల్గొన్నాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
పుట్టపర్తిలో హెల్ప్‌లైన్
నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద భాదితుల సహాయార్థం పుట్టపర్తిలో హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. బెంగళూరు- 080 22354108, 080 22259271, 080 22156554. అదేవిధంగా పుట్టపర్తి సత్యసాయి నిలయం హెల్ప్‌లైన్ నెంబరు 08555280125.దక్షిణమధ్య రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లు. సికింద్రాబాద్ : 040-27700 868, 9701371060. వికారాబాద్ : 08416- 252215, 9701371081. తాండూరు: 08411-272010. బీదర్: 08482 226404, 77609 98400. ధర్మవరం : 08559- 224422. గుంతకల్లు: 08552-220305, 97013 74965.
మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం
ప్రమాద ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ : కేంద్ర మంత్రి ఖర్గే
అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై విచారణకు తిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే తెలిపారు. రైలు ప్రమాద ప్రాంతాన్ని మంత్రి ఖర్గే అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాద ప్రాంతాల్లో ప్రయాణికులతో చర్చించారు. విచారణ తర్వాత బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనలో మృతదేహాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. విచారణకు త్రిసభ్య కమిటీని వేస్తామని అన్నారు. ఇదిలావుంటే ప్రమాదానికి గురైన బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు గుంతకల్లు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అనంతపురం వద్ద ప్రమాదానికి గురైన తర్వాత అధికారులు రైలును ఇక్కడకు చేర్చారు. రైలు అగ్నిప్రమాదానికి గురవడంతో ఇతర బోగీల్లో దుమ్ము, దూళి చేరుకుంది. ప్రస్తుతం ఉన్న బోగీలను తొలగించి వేరే బోగీలు ఏర్పాటు చేయాలని గుంతకల్లు రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. మరోవైపు ప్రమాదస్థలికి ఏపీ ఫోరెన్సిక్ నిపుణులు బయలుదేరాయి. హైదరాబాద్ నుంచి రెండు, కర్నూలు నుంచి ఒక బృందం ఘటనస్థలికి బయలుదేరాయి. ఇదిలావుంటే ప్రజలు తమ ప్రయాణానికి ఎంతో సౌలభ్యంగా భావిస్తున్న రైళ్లు ప్రమాదాలకు గురవుతూ ప్రయాణికుల పాలిట మృత్యు శకటాల్లా మారుతున్నాయి. ఎంతో మందిని క్షతగాత్రులుగా మారుస్తున్నాయి. పెద్దసంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తున్న రైళ్లలో భద్రతా లోపాల వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. పాలెం బస్సు దుర్ఘటన మరచిపోకముందే.. తాజాగా అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలో బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీబోగీలో చెలరేగిన మంటలు సుమారు 26 మంది ప్రాణాలను హరించివేశాయి. 1990, జూన్ 6న రాష్ట్రంలోని గొల్లగూడ వద్ద రైలులో జరిగిన అగ్నిప్రమాదంలో 35 మంది, అదే ఏడాది అక్టోబర్ 10న చర్లపల్లి వద్ద రైలులో మంటలు వ్యాపించి 40 మంది మృతిచెందిన దుర్ఘటనలు అప్పట్లో సంచలనం రేపాయి. 2008, జూలై 31న అర్ధరాత్రి సమయంలో సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. వరంగల్ దాటిన తర్వాత కేసముద్రం మండలం తాళ్లపూసలపల్లి, మహబూబాబాద్‌ల మధ్య చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. 2011, ఆగస్టు 2న మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న లోకల్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు బోగీలు దహనమయ్యాయి. అయితే గార్డ్ అప్రమత్తతతో ప్రాణముప్పు తప్పింది. 2012, మే 22న అనంతపురం జిల్లా పెనుకొండ రైల్వేస్టేషన్లో ట్రాక్ లాక్ చేయని కారణంగా హంపీ ఎక్స్‌ప్రెస్ సిగ్నల్ లేకున్నా స్టేషన్లోకి ప్రవేశించింది. దీంతో రెండో ప్లాట్ఫారం పైకి దూసుకెళ్లి గూడ్స్‌రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24 మందికిపైగా మృతిచెందారు. 2012 జులై 30న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ దాటాక తెల్లవారు జామున ఎస్-11 బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 32 మంది మృతిచెందారు. ఇన్ని ప్రమాదాలు జరిగినా, విచారణ కమిటీలు వేసినా ముందస్తు చర్యలపై ఎలాంటి సూచనలు చేయడం లేదు. అలాగే ప్రమాద నివారణకు తగిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
ప్రమాదంపై అత్యున్నత విచారణ
రైలు ప్రమాదంపై అత్యున్నత విచారణ జరుపుతామని సౌత్ వెస్ట్ జోన్ జీఎం తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గుర్తు పట్టలేనంతగా మృతదేహాలు కాలిపోవడంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. డీఎన్ఏ పరీక్షల తరువాతే మృతదేహాలు అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు. డీఎన్ఏ పరీక్షల కోసం రెండు ఫోరెన్సిక్ బృందాలు అనంతపురం, బెంగళూరుకు బయలుదేరాయి. అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వేస్టేషన్ వద్ద ప్రమాదానికి గురైన బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు బి.1 ఏసీబోగీని పుట్టపర్తి రైల్వేస్టేషన్‌కు తరలించారు. మృత దేహాలను బెంగళూరు విక్టోరియా, బోరింగ్ ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం మృతుల బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరిస్తున్నారు.
ఘోర రైలు ప్రమాదం




