ప్రజలే నన్ను నడిపించాలి : చంద్రబాబు
తిరుపతి, డిసెంబర్ 29 (జనంసాక్షి) :
ప్రజలే తనను నడిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోరారు. కాంగ్రెస్ దుష్టపాలన నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వుందని ఆయన పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన తెలుగుదేశం ప్రజాగర్జనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని, దేశాన్ని కాగ్రెస్ పాలన నుంచి కాపాడమని తిరుపతి వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్టు తెలిపారు. తనది రౌడీ కుటుంబం కాదు, దౌర్జన్యాలు తెలియవని చెప్పుకున్నారు. భారతదేశాన్ని అగ్రగణ్య దేశంగా చేయాలని ఆశించాను తనకు తానుగా జాతీయ నాయకుడనే కలర్ ఇచ్చుకున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ యుగపురుషుడన్నారు. తిరుపతిని వాటికన్‌గా మార్చాలన్నది ఎన్టీఆర్ ఆశయమని, అవినీతిని ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ సహించలేదని, తిరుపతిలో అన్నదానం ప్రారంభించింది ఎన్టీఆర్ అని తెలిపారు. పేదల ఆరోగ్యం కోసం ప్రాణదాన ట్రస్ట్‌ను ఏర్పాటుచేశామన్నారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ దొంగల వల్ల ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. తాము విజన్ 2020 తయారుచేస్తే కాంగ్రెస్ దొంగలు విజన్ 420 తయారుచేశారని ఆరోపణలు గుప్పించారు. సోనియాగాంధీకి దయతో ఓట్లువేస్తే అనకొండ పాము కంటే భయంకరంగా దేశమంతా దేలాది అనకొండలను తయారుచేసిందని మండిపడ్డారు. ఆ అనకొండల్లో వైఎస్ ఒకటి మరోకటి రాబర్ట్‌వద్రా అని తెలిపారు. పిల్ల అనకొండ జగన్ రూపంలో వందలాది కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో అనకొండలను చంపి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారని, అన్ని సమస్యలను మూలకారణం అవినీతే, అవినీతి లేని దేశం కోసం రాజీలేని పోరాటం చేస్తానని గొప్పలు చెప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితమవుతుందని జోష్యం చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మనల్ని మింగేస్తుందని, ప్రజలు నడిపిస్తే బుల్లెట్ లాగా దూసుకెళ్తానని చెప్పుకున్నారు.
ప్రజలే నన్ను నడిపించాలి : చంద్రబాబు




