తెలంగాణ వేగవంతం చేయండి : కోదండరామ్
హైదరాబాద్, డిసెంబర్ 30 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటు వేగంగా పూర్తయ్యేలా రాష్ట్రపతి జోక్యం చేసుకోవాల్సిందిగా వినతిపత్రం సమర్పించామని టీ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌ముఖర్జీని సోమవారం టీజేఏసీ నేతలు కలిసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిల్లుపై ఉన్న అభ్యంత్యరాలను, సవరణలను లిఖిత పూర్వకంగా తర్వాత పంపిస్తామని తెలిపామన్నారు. తెలంగాణ పక్రియ వేగవంతం చేయాలని కోరామని కోదండరామ్ అన్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము చెప్పినవన్నీ రాష్ట్రపతి సావధానంగా విన్నారని తమ విజ్ఞప్తులను స్వీకరించారని తెలిపారు. ఇదిలావుంటే జనవరి 3 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ బిల్లుపై చర్చ జరగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో చర్చను అడ్డుకోవడం సరికాదని తెలంగాణవాయిదా పడితే ప్రమాదకర పరిణామాలు సంభవిస్తాయని నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ, కోస్తాంధ్రలో అసెంబ్లీ స్థానాలు పెంచాలన్నారు. సీమాంధ్ర నేతలు అసెంబ్లీలో టీ బిల్లు చర్చకు రాకుండా అడ్డుకోవడం బరితెగింపు చర్యేనన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణకు తూట్లూ పొడిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కొత్త రాజధాని ఏర్పాటుకు భారీగా నిధులు కేటాయించాలని కోరారు.
ప్రణబ్ జీ.. జోక్యం చేసుకోండి




