Tuesday, 3 November 2026

ఒంటరిపోరాటం చేస్తాం.. ప్రజాపక్షం వహిస్తాం

అసెంబ్లీ వాయిదా పడితే సీమాంధ్రకే ప్రమాదం : నారాయణ
హైదరాబాద్‌, డిసెంబర్‌ 30 (జనంసాక్షి) :
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ స్పష్టం చేశారు. సోమవారం పార్టీ నేతలతో కలిసి ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తాము తెలంగాణకు ఎప్పటికీ మద్దతుగా ఒంటామని ఇలాంటి పరిస్థితుల్లో సీపీఎంతో కలిసి జత కట్టే ఆలోచన లేదన్నారు. కొన్నాళ్ల క్రితం ఈ రెండు పార్టీల మధ్య కూడా అంతరం ఏర్పడే విధంగా విమర్శలు సాగాయి. టీఆర్‌ఎస్‌తో పొత్తుపై వస్తున్నవి ఊహాగానాలు మాత్రమేనని ఆయన చెప్పారు. ఒంటరిగా పోటీచేస్తామని సీపీిఐ శ్రేణులు ఇందుకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లును శాసనసభ, మండలిలో చర్చకు రాకుండా అడ్డుకోవాలని చూస్తే అది సీమాంధ్రకే నష్టమని నారాయణ అన్నారు. సీమాంధ్ర నేతలు నేల విడిచి సాము చేస్తున్నారని అది ఎప్పటికీ మంచిది కాదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న విషయాన్ని విస్మరించి సీమాంధ్ర నేతలు అసంబద్ధమైన డిమాండ్లను తెరపైకి తీసుకురావడం మంచిది కాదన్నారు. కొందరి ప్రయోజనాల కోసం సమైక్య రాష్ట్రాన్ని కోరుకోవద్దని విభజన ద్వారా రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అజీజ్‌పాషా, రామకృష్ణ, గుండా మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *