హైదరాబాద్, డిసెంబర్ 31 (జనంసాక్షి) :
దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్‌ముఖర్జీ 13 రోజుల శీతాకాల విడిది హైదరాబాద్‌లో ముగిసింది. బొల్లారంలో ఆయన శీతాకాల విడిది చేశారు. మంగళవారం ఉదయం ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, డిప్యూటి సిఎం దామోదర రాజనర్సింహ, రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, పితాని సత్యనారాయణ తదితరులు రాష్ట్రపతికి విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రతియేటా రాష్ట్రపతి శీతాకాల విడదికి హైదరాబాద్‌కు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ ఉన్నన్ని రోజులు అధికారిక కార్యక్రమాలు ఇక్కడి నుంచే నిర్వహిస్తారు. ప్రణబ్‌ముఖర్జీ 13 రోజుల శీతాకాల విడిది హైదరాబాద్‌లో మంగళవారంతో ముగియడంతో ఆయన ఉదయం ఢిల్లీకి వెళ్లారు. ఇక్కడ ఉన్నప్పుడే ఆయన అనంతపురంలో దివంగత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 19న హైదరాబాద్ వచ్చిన ప్రణబ్ సోమవారం వరకు బిజీబిజీగా గడిపారు. ఇక ఆయన ఢిల్లీ వెళ్లే ముందు సోమవారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ ¬ం నిర్వహించారు. దీనికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శీతాకాల విడిది ముగింపు సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి నిలయం లాన్స్‌లో ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మండలి ఛైర్మన్ చక్రపాణి, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, చిరంజీవి, రాష్ట్ర మంత్రులు కె.జానారెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, గీతారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజీ వెంకటేష్, ప్రసాద్‌కుమార్, బాలరాజు, కాసు కృష్ణారెడ్డి, ఎంపీలు మధు యాష్కీ, కె.రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డా. జయప్రకాష్‌నారాయణ, అనిల్, గుండా మల్లేష్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పి.వి.సింధు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మొత్తం 700 మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. అనంతరం వారిని రాష్ట్రపతి సత్కరించారు. ఇదిలావుంటే రాష్ట్ర పునర్వ్యవ్థసీకరణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో.. ఈ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీఆర్‌ఎస్, వైకాపా సహా వివిధ పార్టీల అధ్యక్షులు, ఇరు ప్రాంతాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, వివిధ ఐకాసల ప్రతినిధులు రాష్ట్రపతికి వినతులు అందించడానికి క్యూ కట్టారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి 20వ తేదీ రాష్ట్రపతి చెన్నై, తిరువనంతపురం, కొచ్చి వెళ్లారు. ఆ తర్వాత రెండు రోజులు రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలకు చెందిన పార్టీల ప్రతినిధులతో సమావేశాలతో బిజీగా గడిపారు. విభజనను గట్టిగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 22న ప్రణబ్‌తో గంట పాటు సమావేశమయ్యారు. 23న ప్రణబ్ అనంతపురంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు. 24న గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమం ఇదొక్కటే కావడం విశేషం. 25, 27, 28 తేదీల్లో రాష్ట్రపతి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. 26, 29, 30 తేదీల్లో రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు, వివిధ ఐకాసల ప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి విభజనపై వినతులు అందించారు. రాష్ట్రపతి తమ అభ్యర్థనలను సానుకూలంగా విన్నారని, తగిన చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారని ఇరు ప్రాంతాల నేతలు చెప్పడం విశేషం. అయితే రాష్ట్రపతి నిలయం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మొత్తంగా విడిది ముగియడంతో ఆయన ఢిల్లీ వెళ్లారు.
గవర్నర్, సీఎం వీడ్కోలు




