Monday, 2 November 2026

ఫిబ్రవరి ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ

కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌
న్యూఢిల్లీ, జనవరి 1 (జనంసాక్షి) :
ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని కేంద్రమంత్రి జైరామ్‌ రమేష్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. దేశంలో బుధవారం నుంచి కొత్త భూసేకరణ చట్టం అమలవుతుందని చెప్పారు. మార్కెట్‌ ధరలకన్నా పట్టణాల్లో రెట్టింపు ధర, గ్రామాల్లో నాలుగు రెట్లు నష్టపరిహారం ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు ఈనెల 23 వరకు సమయం ఉందని, బిల్లు కేంద్రానికి వచ్చిన తర్వాతే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని జైరామ్‌ రమేష్‌ స్పష్టం చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం జరుగుతుందని ఆయన అన్నారు.120 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రస్తుత భూసేకరణ చట్టం ఇక కనుమరుగు కానుంది. పరిహారమే తప్ప పునరావాసం గురించి చర్చించని దీని స్థానంలో కొత్త చట్టాన్ని ప్రభుత్వం 1నుంచి అమలులోకి తీసుకురాబోతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు తమ భూములను వదులుకుంటున్న వారికి సరైన పరిహారం అందించాలనే లక్ష్యంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఏడాది వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించాయి. సెప్టెంబర్‌ 27న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా దీనికి ఆమోదముద్ర వేశారు. ‘సరైన పరిహారం, పునరావాసం, పునఃపరిష్కారం కల్పించే చట్టంగా ప్రభుత్వం దీన్ని అభివర్ణిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించే ప్రాజెక్టులతోపాటు ప్రైవేటు కంపెనీల ఏర్పాటు కోసం సేకరించే భూమికి సంబంధించి బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించాలన్నది ఈ చట్టం లక్ష్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *