Monday, 2 November 2026

నేడు శ్రీధర్‌బాబు రాజీనామా!

హైదరాబాద్‌, జనవరి 1 (జనంసాక్షి) :
శాసనసభ వ్యవహారాల నుంచి అసెంబ్లీ సమావేశాలకు ముందు తనను తొలగించడంపై మంత్రి శ్రీధర్‌బాబు గుర్రుగా ఉన్నారు. సీఎం నిర్ణయాన్ని నిరసిస్తూ ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. బుధవారం మధ్యాహ్నమే ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు వచ్చినా తెలంగాణకు చెందిన సహచర మంత్రులు వారించడం నిర్ణయం వాయిదా వేసుకున్నారు. గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌ను కలిసి ఆయన తన రాజీమానా లేఖను సమర్పిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు తన శాఖ తొలగింపుపై శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు చేస్తున్న తమ ప్రయత్నాలను కేవలం చట్టానికి లోబడి, రూల్స్‌ ప్రకారమే తాను వ్యవహరిస్తున్నా కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం అసెంబ్లీ వ్యవహారాల శాఖను తొలగించడం బాధ కలిగించిందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్‌ను ఇతర తెలంగాణ మంత్రులతో కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. గడిచిన మూడున్నరేళ్లలో అసెంబ్లీని ఎన్నోసార్లు స్మూత్‌గారన్‌ చేసేందుకు చట్టాలప్రకారం చర్యలు తీసుకున్నానన్నారు. తెలంగాణ బిల్లు విషయంలో గాని, అసెంబ్లీ ప్రోరోగ్‌ విషయంలో కాని తాను ఎక్కడా నిబందనలను తొక్కిపెట్టలేదన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా తాను గత దశాబ్దంన్నరకుపైగా వ్యవహరిస్తున్నానని పేర్కొన్నారు. కేవలం స్వార్థంతో ఉన్న సీమాంధ్ర నేతలు మంత్రులు సిఎంతో కలిసి కుట్ర పన్ని బిల్లును అడ్డుకుంటామనే ధీమాతో తనవద్ద ఉన్న శాఖను తొలగించారని ఆరోపించారు. తనకు ఏదో వాణిజ్య పన్నుల శాఖను ఇచ్చి ప్రమోషన్‌ ఇచ్చాననే ప్రచారం చేస్తున్న సిఎం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తనకు ఉన్న శాఖ కూడా అవసరం లేదన్నారు. తెలంగాణ సాధించడమే ఏకైక లక్ష్యంగా తాను ముందుకు సాగుతానన్నారు. వాణిజ్యపన్నుల శాఖను చేపట్టే ప్రసక్తేలేదన్నారు. ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చిస్తున్నామని. రాష్ట్ర మంత్రులంతా తనకు అండగా నిలువజం ఆనందంగా ఉందన్నారు. కేవలం తెలంగాణ సాధనే తమకు ముందున్న ఏకైక లక్ష్యమన్నారు. సభలో చర్చ జరుగకుండా అడ్డుకోవడంతోపాటు సమైక్య తీర్మాణం పెట్టాలనుకోవడాన్ని కూడా అడ్డుకుని తీరుతామన్నారు. శాఖ మార్చడం అనేది పూర్తిగా తెలంగాణ ప్రజలను కించ పరచడమే అవుతుందన్నారు. మంత్రిగా కూడా కొనసాగాలనే ఉద్దేశ్యం లేదని తనకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనన్నారు. ఇందుకోసం సీఎంనే కాదు అవసరమైతే ఇంక ఆయన తాతను కూడా ఎదిరించేందుకు తెలంగాణ ప్రజలు, మంత్రులం అంతా కలిసికట్టుగా ఉన్నామన్నారు. తన విజ్ఞతను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్న వ్యక్తి కిరణ్‌ అని ఆరోపించారు. ఈపరిస్థితులు తెచ్చిన సీమాంధ్రులకు, ప్రధానంగా ముఖ్యమంత్రికి సరైన రీతుల్లోనే గుణపాఠం చెప్పుతామని హెచ్చరించారు. ఈశాఖను కొనసాగించాలని అధిష్టానంను కోరుతామన్నారు. అలాగే తెలంగాణను అడ్డుకుంటున్న సిఎంను బర్తరఫ్‌ చేయాలని కూడా పెద్దలను కోరుతామన్నారు. తాను ఏనాడు కూడా ఈశాఖ కావాలని పట్టుపట్టనేలేదన్నారు. సీఎం స్వార్థం కోసమే తనను వాడుకున్నాడని విమర్శించారు. తాను ఈశాఖకు సమర్థుడిగా అనిపించక పోతే మూడేళ్లుగా ఎందు కు కొనసాగించారో ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. సీఎంతోపాటు సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు తమ గోతిని తామే తవ్వుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *