బ్యాంకర్ల సమావేశంలో సీఎం కిరణ్
హైదరాబాద్, జనవరి 4 (జనంసాక్షి) :
మైనార్టీలకు రుణాలివ్వలేదని, ఎస్సీలకు మరిన్ని రుణాలివ్వాల్సి ఉండేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జూబ్లీహాల్లో శనివారం సాయంత్రం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బ్యాంకర్ల సహకారంతోనే సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీలకు 60శాతం మేర సబ్సిడీ ఇచ్చామని చెప్పారు. ఈ ఏడాది మహిళా గ్రూపులకు మరింతగా రుణాలిచ్చి సహకరించాలని కోరుతున్నామన్నారు. స్త్రీనిధి ద్వారా మహిళా గ్రూపులకు 16,500 కోట్ల రూపాయలను రుణాలుగా అందించామన్నారు. మహిళలకు భారీగా రుణాలు ఇస్తున్నందుకు బ్యాంకర్లను అభినందిస్తున్నానన్నారు. సుమారు 50శాతం మంది మహిళలకు రుణాలివ్వడం హర్షదాయకమన్నారు. వడ్డీలేని రుణాలను రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని మహిళలకు మాత్రమే కేంద్రం అందిస్తోందన్నారు. ఈ ఏడాది పొడవునా, రానున్న వేసవిలోనూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండబోదని ఆశాభావం వ్యక్తంచేశారు. పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందజేస్తామని, పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇచ్చి సహకరించాలని కోరుతున్నానన్నారు. ఇది ఎన్నికల సంవత్సరమైనందున అన్ని వర్గాలకు రుణాలిచ్చి ఆదుకోవాలన్నారు. అయితే, బ్యాంకర్లకు కొద్దిగా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. సోలార్ విద్యుత్ పరికరాలకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. మైనారిటీలకు రుణాలు ఇవ్వడంలో వెనకబడ్డామని చెప్పారు. విదేశాల్లో పీజి చదువుకునేందుకు వెళ్ళే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గ్రాంటుగా ప్రభుత్వం రూ.10 లక్షలను ఇస్తోందన్నారు. అలాగే, బ్యాంకర్లు కూడా వారికి మరో రూ.5 లక్షలను రుణంగా అందజేసి సహకరించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ, ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 25 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ఆ సదస్సుల్లో తప్పనిసరిగా బ్యాంకర్లు పాల్గొనాలని కోరారు. రైతులకు రుణాలు మంజూరు చేస్తూ వారిని ప్రోత్సహిస్తుండడం అభినందనీయమన్నారు. కిసాన్కార్డులు రైతులందరికీ అందిస్తున్నామని చెప్పారు. మీసేవ ద్వారా కూడా వారికి అందేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. కార్డుల విషయంలో బ్యాంకర్లు వెనుకంజవేయవద్దని సూచించారు.
మైనార్టీలకు రుణాలివ్వలేదు




