తీర్మానం అక్కర్లేదు
ఓటింగ్ జరిగితే సరిపోతుంది
ఇష్టాగోష్టిలో కిరణ్
హైదరాబాద్, జనవరి 4 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన బిల్లు ముసాయిదాకు సంబంధించిన చర్చ శాసనసభలో ఇంకా ప్రారంభం కాలేదని, బహుశా సోమవారం నుంచి చర్చ ప్రారంభం అవుతుందని తాను భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం శాసనసభ లాబీల్లో ఆయన తన కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గతంలో చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పుకొచ్చారు. విభజన విషయంలో అధిష్టానంతో తాను అండర్ స్టాండింగ్‌లోనే ఉన్నానంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ విషయం అవాస్తవమని, తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానంతో తాను పోరాడటానికే నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఈ నెల 23 తరువాత పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆయన తెలిపారు. సమైక్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఉంచాలంటూ ప్రత్యేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం సాధ్యపడదన్నారు. కేవలం బిల్లుపై జరిగే చర్చలో సభ్యులంతా పాల్గొని సమైక్యమా? లేక ప్రత్యేకమా? అన్న విషయంపై అభిప్రాయం చెప్పాలే తప్ప దీనిపై ప్రత్యేకంగా తీర్మానం ఏదీ ఉండదన్నారు. విభజనపై ఓటింగ్ ఉండదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. సభలో సభ్యులు చెప్పే అభిప్రాయాలే ఓటింగ్ అవుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎంతమంది వీడినా పెద్ద నష్టమేమీ ఉండదని అన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక 30 మంది పార్టీని వీడినట్టు చెప్పారు. ఓటింగ్ లేకుండా చర్చ అనే అంశంలో అర్థమే లేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తపార్టీ పెడుతున్నట్టు వస్తున్న వార్తలు నిరాధారమని కొట్టిపారేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న అధిష్టాన వైఖరిని కచ్చితంగా వ్యతిరేకిస్తానన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు రాజీనామా లేఖ తనకు అందినట్టు కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారు. తెలంగాణ బిల్లు ముసాయిదాపై చర్చ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి కావాలనేదే తన ఉద్దేశమన్నారు. తనకు ఉన్న అధికారాలను ఉపయోగించుకుని మంత్రుల శాఖను మార్చానని, పన్నులు వసూళ్లలో కొంత వెనుకబడి ఉన్నందునా వసూళ్లు పెరగాళ్లన్న ఉద్దేశంతో సమర్థుడైన శ్రీధర్‌బాబును ఆ శాఖకు ఎంపిక చేశామే తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదన్నారు. ప్రతి అంశంపై రాజకీయాలు చేయడం చీప్ పాలిట్రిక్స్‌కు పాల్పడటం తన వల్ల కాదన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రక్రియ జరగాలన్నదే తన ఉద్దేశం అన్నారు. సభలో చర్చ జరిగి వీలైనంత మంది సభ్యులు అభిప్రాయం చెప్పాలని, వారి అభిప్రాయాల మేరకే విభజన తీర్మానానికి ఎక్కువ మంది మద్దతు ఇచ్చారా? లేక వ్యతిరేకించారా? అనేది తెలుస్తోందని, అదే ఓటింగ్ అవుతుందన్నారు. చర్చ ఇప్పటికే ప్రారంభమైందంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని అన్నారు. సభలో చర్చ జరిగేటప్పుడు అన్ని పార్టీలు సహకరిస్తేనే జరుగుతుందే తప్ప ఇలా అడ్డుకుంటూ పోతే చర్చ ప్రారంభం కాదన్నారు. గతంలో బీహార్‌లో శాసనసభ మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు విభజన తీర్మానాన్ని తిరస్కరించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. సభలో అందరూ కచ్చితంగా పాల్గొని అభిప్రాయానలు చెప్పాలన్నారు. ఏదిఏమైనా సభలో సమైక్య తీర్మానం కుదరదన్నారు. ఈనెల 23 తర్వాత కొత్త పార్టీ పెడుతున్నట్లు వచ్చిన వార్తల్ని విభజన పక్రియ నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యాచరణపై కొంతమంది ఎమ్మెల్యేలు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కలిశారు. దీనిపై ఈనెల 23 వరకూ ఆగండని ఆయన వారికి నచ్చచెప్పారని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన రెండు రోజుల తర్వాత కార్యాచరణను సిద్ధం చేసుకుందామంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు కిరణ్ బుజ్జగించారు. దాంతో సీఎం కొత్త పార్టీ ఖాయమన్న వార్తలొచ్చాయి. ఈ విషయంపై వివరణ కోరిన మీడియాతో అవన్నీ ఊహాగానాలే అంటూ కిరణ్ ఓ నవ్వుపారేశారు. మరోవైపు ఏ తీర్మానం చేయాలన్నా అసెంబ్లీ పరిధిలోనే జరగాలని సీఎం స్పష్టం చేశారు. మ్యాచ్ ఫిక్స్ అనేది తప్పుడు ఆరోపణ అన్నారు. 23 తర్వాత సీమాంధ్ర నేతలు అంతా సమావేశం అవుతామని, ఆ భేటీ తర్వాతే ఏ నిర్ణయం అయినా చెబుతామన్నారు.
చర్చ ప్రారంభం కాలేదు




