సంపూర్ణ తెలంగాణ దీక్ష విజయవంతం చేయండి : కోదండరామ్
హైదరాబాద్, జనవరి 6 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆగుతుందని ఎవరైనా అనుకుంటే అది భ్రమే అవుతుందని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ప్రక్రియ ఇంతదూరం వచ్చాక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆగే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర రాజకీయ నాయకులు అక్కడి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలకు ఇకనైనా ముగింపు పలకాలని సూచించారు. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే సంపూర్ణ తెలంగాణ సాధన దీక్షకు తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. తెలంగాణవాదం ఎంతలా ఉందో చాటిచెప్పే అవకాశమిదని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రభుత్వం, పెట్టుబడిదారులు ఒక్కటై విభజనను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని వాటన్నింటిని తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, అధికారులు, ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. తెలంగాణ సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. శాసనసభలో సీమాంధ్ర నేతల తీరు సరిగా లేదని, ఇప్పటికైనా నిజాలు గుర్తించి సభలో చర్చించడం ద్వారా తమ ప్రాంత ప్రజల డిమాండ్లేమిటో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. నేతలు తమ స్వార్థం కోసం, హైదరాబాద్‌పై హక్కుల కోసం దింపుడుకల్లం ఆశతో చివరి ప్రయత్నాలు చేస్తున్నారని కానీ అవి నెరవేరబోవన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రజల్లోంచి వచ్చిందని, సమైక్యాంధ్ర ఉద్యమం పెట్టుబడిదారులు, దొంగతనంగా ఉద్యోగాలు సాధించిన వారిది మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. పది జిల్లాల ప్రజలు గొంతెత్తి గర్జిస్తే సీమాంధ్ర పెత్తందారులు పారిపోవడం ఖాయమన్నారు. సంపూర్ణ తెలంగాణ సాధనే తమ ధ్యేయమని, హైదరాబాద్‌పై కూడా ఆంక్షలు అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ఆగుతుందనుకోవడం భ్రమే




