Tuesday, 3 November 2026

దొరల తెలంగాణకాదు.. నవ తెలంగాణే లక్ష్యం

కాదంటే మరో పోరాటం
డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ
హైదరాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి) :
దొరల తెలంగాణకాదు.. నవ తెలంగాణ నిర్మాణమే లక్షమని డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తెలిపారు. 57 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 46 ఏళ్లు సీమాంధ్రులే రాష్ట్రాన్ని పాలించారని, వారంతా తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని ఆయన ఆరోపించారు. నగరంలోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో ఆ సంఘం 2014 డైరీని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం ఎంతగానో నష్టపోయిందని, అణగారిన వర్గాలు మరింతగా నష్టపోయాయని ఆయన పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల ఆకాంక్ష, నాలుగున్నర దశాబ్దాల పోరాటం త్వరలో ఫలించబోతోందని ఆయన చెప్పారు. నవ తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ఇక ముందుకు సాగుతామని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కుల ఆధిపత్యం పెచ్చరిల్లితే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. దొరల ఆధిపత్యాన్ని తెలంగాణ పౌర సమాజం అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ, తెలంగాణ బిల్లుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలు త్వరగా చెప్పి రాష్ట్రపతికి తిప్పిపంపాలని కోరారు. బిల్లును ఈ దశలోనూ అడ్డుకోవాలని చూస్తున్న వారు తమ ప్రాంత ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్ర పెత్తందారుల ఆస్తుల పరిరక్షణ ఆరాటాన్ని ఒకే ఘాటన కట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌ మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణంలో ఉద్యోగులం భాగస్వాములమవుతామని చెప్పారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వివేక్‌, ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *