రాహుల్‌గాంధీ
బెంగళూర్, జనవరి 11 (జనంసాక్షి) :
జనాభిప్రాయమే తమ పార్టీ ప్రణాళిక అవుతుందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. శనివారం కర్ణాటకలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. అలాగే ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ముందుగానే వెల్లడించనున్నట్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. ‘కొత్త విధానంలో భాగంగా టికెట్లపై నిర్ణయం తీసుకుంటున్నాం. చాలారోజులగా రాష్ట్రాల్లోని పార్టీశాఖలో దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రజాప్రాయాన్ని ప్రతిబింబించేలా ప్రక్రియను వ్యవస్థీకృతం చేస్తున్నాం. అందుకే ఈ చ్చలన్నీ! జాతీయస్థాయిలో టికెట్లను ఖరారు చేస్తాం. అది కూడా అతిత్వరలోనే’ అని రాహుల్‌గాంధీ వివరించారు. అభ్యర్థుల ఎంపికతో పాటు రాజకీయ నిర్ణయాలన్నింటిలోనూ సామాన్య ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేశారు. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కీలకమైన సూచనలు చేశారు. గెలుపుగుర్రమో కాదో చూడటంతోపాటుగా ఎలాంటి నేరచరిత్ర లేకుండా చూడాలనీ, సరైన రాజకీయ అనుభవం ఉందోలేదో చూడాలని స్పష్టంచేశారు. ఈ నెల 17న జరిగే ఏఐసీసీ సమావేశం తర్వాత అభ్యర్థుల ఎంపికకు సంబందించిన స్క్రీనింగ్ కమిటీల భేటీలు మొదలవుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారంనాటి సమావేశంలోనే వీటి భేటీలకు సంబంధించిన తేదీలను ఖారారు చేసినట్లు సమాచారం ముందుగానే అభ్యర్థుల ఎంపిక పట్ల రాహుల్ పట్టుదలతో ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా దాదాపు 150 నుంచి 200 మందితో కూడిన జాబితాను సిద్ధం చేస్తారు. ముఖ్యంగా పొత్తులు అవసరం లేనిచోట్ల ముందే ఖరారవుతాయి. పొత్తులు అవసరమైన రాష్ట్రాల్లో కూడా అభ్యర్థులను ముందుస్తుగానేసిద్ధం చేసుకోవాలని యోచిస్తున్నారు. అవసరమైతే తర్వాత మార్చుకోవాల్సి వచ్చినా ముందస్తు ఏర్పాట్లు మాత్రం ఆపొద్దన్నది పార్టీవర్గాల భావన. తద్వారా అభ్యర్థులకు ఎన్నికలకు సిద్ధమవటానికి మూడునెలల సమయం ఇచ్చినట్లువుతుంది. ఇదే వ్యూహంతో రాహుల్ ప్రజలతో నేరుగా సమావేశమవుతూ పార్టీ ప్రజల్లోంచే వచ్చిందనే భావన కలుగజేయడానికి ప్రయత్నిస్తున్నారు.





