అనైతిక చర్యలు.. క్రమశిక్షణ ఉల్లంఘన
మేమే శిక్షించాలనుకున్నాం
ఆయనతో లొంగిపోయిన ఆమె భార్య కాదు
ప్రసాద్ మూల్యం చెల్లించకతప్పదు
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామన్న
హైదరాబాద్, జనవరి 13 (జనంసాక్షి) :
మావోయిస్టు పార్టీ మాజీ నాయకుడు గుడ్సా ఉసెండీ ఉరఫ్ గుమడవెల్లి వెంకటకృష్ణప్రసాద్ ఉద్యమ ద్రోహానికి పాల్పడ్డాడని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామన్న తెలిపారు. ఈమేరకు సోమవారం పత్రికా కార్యలయాలకు ఆయన ఒక ఆడియో టేప్‌ను పంపారు. ఉద్యమంలో ఉంటూ అనైతిక చర్యలకు పాల్పడ్డాడని, పలు మార్లు క్రమశిక్షణ ఉల్లంఘించాడని ఆయన పేర్కొన్నారు. తామే శిక్షిస్తామనుకుంటున్న సమయంలో పాలకవర్గాలు ఎర చూపే రివార్డుల కోసం ప్రభుత్వం ముందు మోకరిల్లాడని ఆరోపించారు. ఆయనతో పాటు లొంగిపోయిన సంతోషి ఆయన భార్య కాదని రామన్న స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అధికార ప్రతినిధిగా గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఉసెండీ రాజకీయంగా, నైతికంగా పతనం చెందాడని తెలిపారు. కమ్యూనిస్టు విలువలుకు, ఆదర్శాలకు తిలోదకాలిచ్చి, పార్టీకి, విప్లవోద్యమానికి నమ్మకద్రోహం చేసి పార్టీ విడిచి పారిపోయి ఈనెల 9న భారత పాలకవర్గాల ముందు మోఖరిల్లాడని చెప్పారు. జల్, జంగల్, జమీన్ విముక్తి కోసం పోరాడుతున్న తాడిత, పీడిత వర్గాల ప్రజలపై పాకల వర్గాలు యుద్ధాన్ని మోపాయని తెలిపారు. దోపిడీ ప్రభుత్వాల ద్వారా రుద్దబడిన ఈ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో విముక్తి ఉద్యమాలను నిర్వహిస్తోందని చెప్పారు. ఈ విముక్తి ఉద్యమాలను అణచివేయడానికి దేశ పాలకవర్గాలు 2009 నుంచి ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో దేశ ప్రజలపై పాలకవర్గాలు యుద్ధాన్ని మోపాయన్నారు. పార్టీ నాయకత్వంలో విప్లవ ప్రజాసంఘాలు ఈ యుద్ధాన్ని దీటుగా ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఇదే సమయంలో బలహీనులు ఈ యుద్ధానికి భయపడి ఉద్యమం నుంచి పారిపోతున్నారని, అలాంటి బలహీనుల్లో ఒకడే ఉసెండీ ఉరఫ్ సూర్యం అని తెలిపారు. జీవితాంతం నిస్వార్థంగా పీడిత ప్రజలకు రాజ్యాధికారం కోసం పోరాడటం వారి కోసమే జీవించి మరణించే దృఢ సంకల్పంతో పనిచేయడం కమ్యూనిస్టు విప్లవకారుల భౌతిక లక్ష్యమని చెప్పారు. అయితే కొందరు ఇలాంటి సందర్భాల్లో రాజకీయ వర్గాల శరణు కోరడం సహజమేనని ఇలాగే ఉసెండీ పార్టీని ప్రజలను మోసగించి పార్టీ నుంచి వెళ్లిపోయాడు. కానీ ఈ పోరాటంలో అంతిమ విజయం మాత్రం ప్రజలదేనని చెప్పారు. ప్రపంచంలో ఇది ఎన్నో సార్లు రుజువైందని, ఈ చారిత్రక సత్యాన్ని మరిచిన ఉసెండీకి పార్టీ, ప్రజలపైనే కాకుండా తనపైనా కూడా విశ్వాసం సడలిందని తెలిపారు. దివాళాకోరు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు లోనై శత్రువు చెంతకు చేరాడు. ప్రజల కోసం జీవిస్తూ వారికి సేవ చేయడం మాని పాలకులు విదిల్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రాణభిక్ష అడగడం ద్వారా ఉద్యమ ద్రోహానికి పాల్పడ్డాడని తెలిపారు. ఉసెండీ ఉరఫ్ సూర్యం తన భార్యతో లొంగిపోయినట్లుగా చెప్పినదాన్లో వాస్తవం లేదు. సూర్యంతో పాటు లొంగిపోయింది వాస్తవానికి ఆయన భార్య కాదన్నారు. సూర్యం భార్య రాజీ ఇప్పటికీ పార్టీలోనే ఉందని తెలిపారు. సూర్యం భార్యతో కాకుండా మరో మహిళతో పార్టీ విడిచి పారిపోవడం ఆయన నైతిక పతనానికి పరాకాష్టగా అభివర్ణించారు. ఉసెండీ 80వ దశకంలో పార్టీలో చేరాడని, 1993లో పార్టీ పరంగా క్లిష్ట పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. 1993 నుంచి 97 మధ్య సాధారణ జీవితాన్ని గడిపాడన్నారు. 97లో మళ్లీ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపాడని చాలా కాలం ఆయన్ను గమనించిన తర్వాత పార్టీ అందుకు ఆమోదం తెలిపింది. పార్టీలో తిరిగి చేరనప్పటి నుంచి లొంగిపోయే వరకు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చాడు. సెప్టెంబర్ 2006లో జరిగిన దండకారణ్య సమావేశంలో అతడిని డీకే జోన్ బాధ్యుడిగా తీసుకున్నారని చెప్పారు. అప్పట్నుంచి అతడు డీకే అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చాడని తెలిపారు. ఆయన వ్యక్తి బలహీనతలతో పాటు పాలకవర్గాలు విదిల్చే రివార్డు కోసం పార్టీని వీడి ఉద్యమ ద్రోహం చేశాడని తెలిపారు.




