ప్రధాని మన్మోహన్
న్యూఢిల్లీ, జనవరి 15 (జనంసాక్షి) :
ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారతరత్న ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు యువతకు స్ఫూర్తి ప్రదాత అని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ అన్నారు. ఆయన సాధించిన విజయాలకు యువతరానికి ఆదర్శణీయం కావాలని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు సన్మానసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రావు చిన్నతనంలోనే ఎన్నో అడ్డంకులను అధిగమించి చదువుకు అనుకూలమైన పరిస్థితులు కల్పించుకున్నారని, తర్వాత స్వయం కృషితో చదువు కొనసాగించి బోధన, పరిశోధన రంగాల్లో ఎంతగానో రాణించారని కొనియాడారు. అభివృద్ధి చెందిన ఆధిపత్య దేశాలకు కన్నుకుట్టేలా సీఎన్‌ఆర్ రావు కష్టించి దేశానికి పరిశోధన రంగంలో ఎంతగానో పేరు తీసుకువచ్చారని తెలిపారు. భారత్‌లోనూ ప్రపంచస్థాయి పరిశోధనలు సాధ్యమేనని నిరూపించిన ఘనుడు రావు అని కొనియాడారు. భారత ప్రధానమంత్రి శాస్త్ర సలహామండలి అధ్యక్షుడిగా దేశ శాస్త్ర, సాంకేతిక విధానాల రూపకల్పనలో రావు కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఆయన సూచనలు తనకు ఎంతగానో ఉపకరించాయని పేర్కొన్నారు. బెంగళూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పునరుద్దరణకు రావు ఎంతగానో కృషి చేశారని చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో అధునాతర సౌకర్యాల కల్పనకు , నైపుణ్యం గల శాస్త్రవేత్తల బృందాన్ని తీర్చిదిద్దడానికి ఎంతో పట్టుదలతో పని చేస్తున్నారని తెలిపారు. రావుకు పద్మశ్రీ. పద్మభూషణ్ వంటి ఎన్నో పురస్కారాలను ప్రదానం చేసిన దేశం ఇప్పుడు భారతరత్న ప్రకటించి ఆయన మనదేశంలోనే మహోన్నతమైన వ్యక్తి అని ప్రకటించామని తెలిపారు. దేశ అభివృద్ధిపై శాస్త్ర సాంకేతిక రంగం ప్రభావం ఎంతగానో ఉందని తెలిపారు.
సీఎన్‌ఆర్ రావు యువతకు స్ఫూర్తి




