Wednesday, 4 November 2026

పదవి దక్కని వినోద్‌ బిన్నీ విసుర్లు

ఖండించిన కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, జనవరి 15 (జనంసాక్షి) :
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయ తుపాను సృష్టించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజకీయ ప్రభావానికి లోనవుతోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఆరోపణలు గుప్పించారు. పూర్తి వివరాలతో గురువారం మీడియా సమావేశం నిర్వహిస్తానని పేర్కొన్నాడు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వినోద్‌కుమార్‌ బిన్నీ బుధవారం తన ఆరోపణలతో మీడియా దృష్టిని ఆకర్షించారు. అవినీతిని నిరోధించి, సుపరిపాలన అందిస్తామన్న వాగ్దానంతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్‌ఆద్మీ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సినియర్‌ ఎకె వాలియాను మట్టి కరిపించిన వినోద్‌ కుమార్‌ బిన్ని, పార్టీ ఆశయాలకు దూరంగా వెళుతోందని, ఎన్నికల వాగ్దానాలు అమలు చేయగా సామర్థ్యం లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం వివాదానికి దారి తీసింది. దీనిపై దుమారం చెలరేగడంతో వెంటనే మీడియాతో మాట్లాడిన బిన్ని, తనకు పార్టీతో అంతర్గతంగా ఎటువంటి విభేదాల్లేవని చెప్పారు. మంత్రి పదవి ఇవ్వక పోవడంపై తాను మన:స్తాపానికి గురి కాలేదని బిన్ని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కేబినేట్‌ మంత్రుల జాబితా నుంచి తన పేరు తప్పించడంపై పార్టీతో తనకెటువంటి విభేదాలు తలెత్తలేదన్నారు. లక్ష్మీనగర్‌ నియోజకవర్గం నుంచి ప్రముఖ కాంగ్రెస్‌ పార్టీ నేత ఎకె వాలియాను మట్టి కరిపించిన బిన్ని, అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలో పదవీ ప్రమాణం చేసే మంత్రుల జాబితాలో తన పేరు తప్పించాలని తానే వ్యక్తిగతంగా అధినేతకు కోరినట్లు చెప్పారు. మంగళవారం పార్టీ నాయకత్వం, ఎన్నికైన శాసనసభ్యుల సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో కూడా ఎటువంటి సమస్యలు లేవనెత్తకుండా మీడియా ముందు పార్టీకి వ్యతిరేకంగా బిన్ని స్పందించడం పొరపాటని భావిస్తున్నారు. ప్రజలకు చేసిన వాగ్ధానాలు అమలు చేయగల శక్తి సామర్థ్యాలు పార్టీకి లేవని బిన్ని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *